Share News

ఆక్రమణలకు అడ్డుకట్ట

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:22 AM

నగరంలో పలు రహదారులతో పాటు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ దుకాణాలు వెలిశాయి. వీటి కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగి, తరచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు హాకర్స్‌ జోన్‌లు ఏర్పాటుచేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ నిర్ణయించారు. ప్రస్తుతం రోడ్లు ఆక్రమించి వ్యాపారులు చేసుకుంటున్న వారిని అక్కడకు తరలించనున్నారు. దీనికోసం కార్యాచరణ ప్రారంభించారు.

ఆక్రమణలకు  అడ్డుకట్ట

రోడ్డు మార్జిన్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాల తొలగింపునకు నడుంబిగించిన జీవీఎంసీ

ఇప్పటికే పూర్తయిన సర్వే

ప్రతి వార్డులో కనీసం ఒక హాకర్‌ జోన్‌ ఏర్పాటు

98 వార్డుల్లో 112 జోన్లు

వ్యాపారులను అక్కడకు తరలించాలని నిర్ణయం

ఆపరేషన్‌ లంగ్స్‌ పేరుతో ఆక్రమణల తొలగింపు

ఇకపై నిరంతరం కొనసాగనున్న స్పెషల్‌డ్రైవ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో పలు రహదారులతో పాటు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ దుకాణాలు వెలిశాయి. వీటి కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగి, తరచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు హాకర్స్‌ జోన్‌లు ఏర్పాటుచేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ నిర్ణయించారు. ప్రస్తుతం రోడ్లు ఆక్రమించి వ్యాపారులు చేసుకుంటున్న వారిని అక్కడకు తరలించనున్నారు. దీనికోసం కార్యాచరణ ప్రారంభించారు.

ఉపాధి కోసం పేదలు రోడ్డుపక్కన దుకాణం పెట్టుకుంటారు. అయితే కొందరు కార్పొరేటర్లు, రాజకీయ నేతలు సొంతంగా రోడ్డుపక్కన దుకాణాలు ఏర్పాటుచేసి వాటిని ఇతరులకు అద్దెకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకరు అన్నట్టు నగరమంతా ఇదే ట్రెండ్‌ కొనసాగడంతో ప్రధాన రోడ్లు, కూడళ్లు ఆక్రమణలతో బక్కచిక్కిపోయాయి. ద్వారకా నగర్‌, జగదాంబ కూడలి, డైమండ్‌ పార్కు, మద్దిలపాలెం వంటి ప్రాంతాల్లో జీవీఎంసీ నిర్మించిన ఫుట్‌పాత్‌లను కూడా ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఆక్రమణల వల్ల పాదచారులు, వాహన చోదకులు ఎదుర్కొంటున్న అవస్థలను జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు గమనించారు. నగరంలో ఎక్కడికక్కడ వెండింగ్‌ జోన్స్‌ ఏర్పాటుచేసి, వ్యాపారులను అక్కడకు తరలించడం వల్ల సమస్యను పరిష్కరించవచ్చునని గుర్తించారు. నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్న వారిని గుర్తించే బాధ్యతను టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో పనిచేసే వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలకు అప్పగించారు. సర్వే దాదాపు చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం. ఆక్రమణలను తొలగించినా వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వెండింగ్‌జోన్‌లు ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించే పనిలో జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఉన్నారు. ప్రస్తుతానికి 98 వార్డుల పరిధిలో 112 చోట్ల వెండింగ్‌ జోన్‌ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు. ఆయా చోట్లకు ఆక్రమణదారులను తరలిస్తే రోడ్లన్నీ విశాలంగా మారి వాహనాల రాకపోకలు సజావుగా సాగడంతోపాటు ప్రమాదాలకు అడ్డుకట్టపడుతుందన్నది కమిషనర్‌ భావన. దీనికోసం పోలీస్‌ అధికారులతో పలుమార్లు సమావేశమై ఆక్రమణల తొలగింపునకు సహకరించాలని కోరడంతో సీపీ శంఖబ్రతబాగ్చి అంగీకరించారు.

ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం

నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీవీఎంసీ అధికారులు ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరుతో గురువారం స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)తో పాటు ప్రతి శుక్రవారం నిర్వహించే టౌన్‌ప్లానింగ్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కుల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తుండడంతో వాటిపై చర్యలకు కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇకపై నిరంతరం ఆక్రమణల తొలగింపు కొనసాగేలా కార్యాచరణ రూపొందించి గురువారం నుంచి అమలు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా పోలీసుల సహకారంతో జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కుల్లో 524 ఆక్రమణలను తొలగించారు. తగరపువలస మెయిన్‌రోడ్డులో 20, తగరపువలస-భీమిలి రోడ్డులో 20, మధురవాడ వుడా మిథిలాపురి కాలనీలో 52, గురుద్వారా జంక్షన్‌లో 42, డైమండ్‌ పార్క్‌ నుంచి శాంతిపురం జంక్షన్‌కు వెళ్లే రహదారిలో 42, సిరిపురం జంక్షన్‌ నుంచి జగదాంబ జంక్షన్‌కు వెళ్లే మార్గంలో 60, నరసింహనగర్‌ జంక్షన్‌ నుంచి డీఎల్‌బీ గ్రౌండ్‌ వరకు 46, పాతగాజువాక మెయిన్‌రోడ్డులో 53, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు నుంచి గోపాలపట్నం పెట్రోల్‌బంకు వరకు 45, విమాన్‌నగర్‌ జంక్షన్‌లో 22, అనకాపల్లి నెహ్రూచౌక్‌ వద్ద 42, వంటిల్లు జంక్షన్‌లో 33 ఆక్రమణలను తొలగించారు.

Updated Date - Sep 19 , 2025 | 01:22 AM