Share News

వరిపై సుడిదోమ దాడి!

ABN , Publish Date - Oct 02 , 2025 | 12:28 AM

జిల్లాలో వరి పైరుపై సుడిదోమ ప్రభావం తీవ్రంగా ఉంది. దుబ్బు కడుతున్న తరుణంలో వందలాది ఎకరాల్లో వరిపైరును సుడిదోమ ఆశించింది. దోమపోటుతో వరి ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగానే సుడిదోమ వ్యాప్తి చెందుతున్నదని, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో వెంటనే మందులను పిచికారీ చేసి సుడిదోమ బెడదను నివారించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు తెలిపారు.

వరిపై సుడిదోమ దాడి!
చీడికాడ మండలం మంచాలలో సుడిదోమ ఆశించడంతో పసుపు రంగులోకి మారిన వరి ఆకుల చివర్లు

ఆర్‌జీఎల్‌ 2537 (శ్రీకాకుళం సన్నాలు) రకానికి ఎక్కువ బెడద

వరి దుబ్బుల వద్ద గుంపులుగా దోమలు

రసం పీల్చేయడంతో పసుపు రంగులోకి మారిపోయి ఎండుతున్న ఆకులు

వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారుల సూచన

అనకాపల్లి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి పైరుపై సుడిదోమ ప్రభావం తీవ్రంగా ఉంది. దుబ్బు కడుతున్న తరుణంలో వందలాది ఎకరాల్లో వరిపైరును సుడిదోమ ఆశించింది. దోమపోటుతో వరి ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగానే సుడిదోమ వ్యాప్తి చెందుతున్నదని, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో వెంటనే మందులను పిచికారీ చేసి సుడిదోమ బెడదను నివారించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు తెలిపారు.

సుడిదోమ తెగులు లక్షణాలు, నివారణ చర్యలు

అధిక తేమతో కూడిన వాతావరణం, మోతాదుకు మించి యూరియా వాడడం, దమ్ము సరిగా చేయకపోవడం, గట్లపై కలుపు మొక్కలు పెరిగిపోవడం వంటి కారణాల వల్ల వరి పైరును సుడిదోమ, తెల్లవీపుమచ్చ దోమలు ఆశిస్తుంటాయి. ఆర్‌జీఎల్‌ 2537 (శ్రీకాకుళం సన్నాలు) వరి రకానికి ఎక్కువగా ఈ దోమలు ఆశించినట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. బీపీటీ 5204 (సాంబ మసూరి ) రకానికి తక్కువగా దోమ ఆశించింది. ఎంటీయూ 1062 (ఇంద్ర) రకానికి దోమ ప్రభావం పెద్దగా లేదు. సుడిదోమలు వరి దుబ్బుల అడుగు భాగంలో చేరి, రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపురంగులోకి మారి ఎండిపోయినట్టు కనిపిస్తాయి.

సుడిదోమ, తెల్లవీపుమచ్చ దోమ ప్రారంభ దశలో వుంటే ఎకరాకు ఎసిఫేట్‌ 75 ఎస్‌పీ మందు 250 నుంచి 300 గ్రాములు లేదా ఇమిడాక్లోఫ్రిడ్‌ లేదా ఎఽథిప్రోల్‌ 80 డబ్ల్యూజీ 50 గ్రాముల మందును 200 నుంచి 250 లీటర్ల నీటిలో కలిపి ఆకులు, దుబ్బులు తడిచేలా పిచికారీ చేయాలి. దోమ ఉధృతి అధికంగా వుంటే లీటరు నీటికి పైమేట్రోజైన్‌ 50 డబ్ల్యూజీ 0.6 గ్రాములు లేదా ప్లోనికామిడ్‌ 50 ఎస్‌జీ 0.4 గ్రాములు లేదా డైనోటైప్యూరాన్‌ 20ఎస్‌జీ 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పొలంలో నీటి పూర్తిగా తీసివేసి, సాయంత్ర సమయంలో మందు నీటిని పిచికారీ చేయడం మంచిది. తొలుత గట్లను ఆనుకొని పైరుపై మందు నీటిని పిచికారీ చేయడం ప్రారంభించి తరువాత బొంగరం తరహాలో లోపలి వైపునకు పిచికారీ చేసుకుంటూ వెళ్లాలి. సుడిదోమ, తెల్లవీపుమచ్చ దోమ ప్రభావం లేని పొలాల్లో కూడా ముందు జాగ్రత్తగా వేపనూనె లేదా నీమాస్త్రం ఒకసారి పిచికారీ చేసుకోవడం మంచిది. దోమ ఉధృతికి దోహదపడే క్వినాల్‌ఫాస్‌, ప్రొఫినోఫాస్‌, మిథైల్‌ పరాఽథియాన్‌, ట్రైజోఫాస్‌, ఫోరెట్‌ 10 జీ గుళికలు, సింథటిక్‌ పైరిత్రాయిడ్‌ వర్గానికి చెందిన డెల్టామెత్రిన్‌, సైపర్మెత్రిన్‌ వంటి పరులు మందులు వాడకూడదు.

Updated Date - Oct 02 , 2025 | 12:28 AM