Share News

ప్రభుత్వ ఉద్యోగుల పుట్టినిల్లు.. తోటలూరు

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:44 PM

మండలంలోని రావణాపల్లి పంచాయతీ శివారు తోటలూరు గ్రామం.. ఈ ఊరికి ఓ ప్రత్యేక ఉంది. కేవలం వంద ఇళ్లు ఉండే ఈ ఊరిలోని ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు.

 ప్రభుత్వ ఉద్యోగుల పుట్టినిల్లు.. తోటలూరు
తోటలూరు గ్రామం

గ్రామంలోని వంద ఇళ్లలో ప్రతి ఇంట్లో ఓ ఉద్యోగి

పూర్వీకుల పట్టుదలతో విద్యావంతులు ఎక్కువ

కొయ్యూరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని రావణాపల్లి పంచాయతీ శివారు తోటలూరు గ్రామం.. ఈ ఊరికి ఓ ప్రత్యేక ఉంది. కేవలం వంద ఇళ్లు ఉండే ఈ ఊరిలోని ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. యాభై ఏళ్ల క్రితం వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించిన ఇక్కడి ప్రజలు ముందు తరాలు ఇలా కాకూడదని చదువుపై దృష్టి పెట్టారు. తమ పిల్లలను బాగా చదివించడంతో ఇప్పుడు ఊర్లో ప్రభుత్వ కొలువులు సాధించినవారు ఎక్కువ మందే ఉన్నారు.

తోటలూరు గ్రామంలో యాభై ఏళ్ల క్రితం సరైన రవాణా, విద్యుత్‌ సౌకర్యం ఉండేవికావు. వంద ఇళ్లు ఉండే ఈ గ్రామంలో అందరూ వ్యవసాయ కూలీలుగానే జీవనం సాగించేవారు. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. గ్రామంలో ఎయిడెడ్‌ పాఠశాల ఉన్నా ఆర్థిక స్థోమత లేక మండల కేంద్రంలోని కేంద్రీకృత ఆశ్రమ పాఠశాల, వైఎన్‌ పాకలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలను చదివించారు. అప్పట్లో ఆశ్రమ పాఠశాలల నిర్వహణ సక్రమంగా ఉండకపోవడం, పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉండడంతో విద్యార్ధులకు సరైన తిండి కూడా ఉండేది కాదు. చాలామంది విద్యార్థులు ఇళ్లకు వచ్చేసేవారు. అప్పట్లో గ్రామ పెద్దలు ఆ పిల్లలకు నచ్చజెప్పి.. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని వారికి ప్రత్యక్షంగా చూపించి బడికి వెళ్లడానికి ప్రోత్సహించారు. ఈ గ్రామంలో తొలిసారిగా పొడుగు ఎర్రయ్య అనే వ్యక్తికి జీసీసీ సేల్స్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. మరో నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో మరికొందరు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 90 మందికి పైగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క ఉపాధ్యాయ వృత్తిలోనే 20 మంది కొనసాగుతున్నారు. ఆర్టీసీలో డ్రైవర్‌, కండక్టర్లుగా ఏడుగురు, వైద్య, ఆరోగ్యశాఖలో ఏడుగురు, విశాఖ పోర్టులో ఇద్దరు, పోలీస్‌శాఖలో నలుగురు, మహిళా, స్త్రీ సంక్షేమశాఖలో నలుగురు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పది మంది, ఇలా పలు ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ గ్రామంలో అందరూ విద్యావంతులే కావడం విశేషం.

Updated Date - Apr 09 , 2025 | 11:44 PM