Share News

పర్సంటేజీలు ఇస్తేనే బిల్లులు!

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:21 AM

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ ఎ.శ్రీనివాస్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

పర్సంటేజీలు ఇస్తేనే బిల్లులు!

  • పనుల ఒప్పందం సమయంలోనే డిమాండ్‌

  • బిల్లుల చెల్లింపునకు మళ్లీ బేరాలు

  • విశాఖ ఎస్‌ఈ కార్యాలయంలో సొంత కోటరీ

  • గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ నిర్వాకం

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ ఎ.శ్రీనివాస్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఎస్‌ఈగా పనిచేస్తున్న సమయంలో ఇక్కడి కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో సొంత కోటరీని ఏర్పాటు చేసుకుని, కాంట్రాక్టర్లతో బేరాలు నడిపేవారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలు విలువైన పనులుచేసి, బిల్లుల కోసం నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగిన కొందరు కాంట్రాక్టర్లలో ఒకరు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.

టెండర్లద్వారా పనులు దక్కించుకున్న తరువాత అగ్రిమెంట్‌ కుదుర్చుకోవాలి. ఆ తరువాత పనులు చేసిన మేరకు పార్టు బిల్లులు, చివరకు ఫైనల్‌ బిల్లులు చెల్లిస్తారు. సాధారణంగా ప్రభుత్వ ఇంజనీరింగ్‌ శాఖల్లో బిల్లుల సమయంలోనే పర్సంటేజ్‌లు తీసుకుంటారు. బిల్లులో సుమారు 10 శాతం అన్నిస్థాయి అధికారులకు ఇవ్వాల్సిందే. ఇది బహిరంగ రహస్యం. అయితే గిరిజన సంక్షేమఇంజనీరింగ్‌ శాఖలో ఎస్‌ఈగా పనిచేసిన శ్రీనివాస్‌ మాత్రం రెండుసార్లు పర్సంటేజ్‌లు వసూలు చేసేవారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పనికి సంబంధించి అగ్రిమెంట్‌ కుదర్చుకునేటప్పుడు పనివిలువలో ఒక శాతం, ఎస్‌ఈ కార్యాలయంలో సిబ్బందికి అర శాతం వసూలు చేసేవారంటున్నారు. తరువాత పెట్టిన ప్రతి బిల్లు మంజూరుకు ఒక శాతం ఇచ్చుకోవాల్సిందేనని, లేదంటే కాంట్రాక్టర్లకు చుక్కలు చూపించేవారని వాపోయారు. ఏదైనా కారణంతో మధ్యలో నిలిచిపోయిన పనులు తిరిగి చేపట్టే సమయంలో ఎస్టిమేట్లు పెంచితే మళ్లీ వేరుగా పర్సంటేజ్‌లు తీసుకునేవారని చెబుతున్నారు. ఎస్‌ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో కొందరిని ఎంపికచేసి వారితో తిరుగులేని కోటరీ ఏర్పాటుచేసుకున్నారని, వారంతా అతని వర్గానికి చెందినవారేనని పేర్కొంటున్నారు.

అధికారులకు వేధింపులు

విశాఖ సర్కిల్‌ పరిధి సీతంపేటలో పనిచేసిన ఈఈ ఒకరు ఎస్‌ఈ శ్రీనివాస్‌ పనితీరు నచ్చక విభేదించారు. దీంతో సదరు ఈఈని నెల్లూరు బదిలీచేశారు. అతడు కోర్టు నుంచి ఆర్డర్‌ తెచ్చుకుని ప్రస్తుతం ఇక్కడే పనిచేస్తున్నారు. గతంలో పార్వతీపురం ఎస్‌ఈగా పనిచేసిన అధికారిని తీవ్రంగా వేధించడంతోపాటు తనకున్న పలుకుబడితో అక్కడి ఎస్‌ఈ కార్యాలయాన్ని రద్దుచేయించారు. అక్కడ పనిచేసే ఎస్‌ఈని ఈఈగా రివర్షన్‌ చేశారు. ఈఈగా పనిచేసిన మరో అధికారిని డీఈగా రివర్షన్‌ చేయగా, చివరకు అదే కేడర్‌లో అతను ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో విశాఖ ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న అతని మనుషులు ఇప్పటికే కొన్ని పైళ్లు దాచేశారని తాజాగా ప్రచారం జరుగుతోంది. వాటిలో అనేక లోపాలు ఉండడంతో పొరపొటున ఏసీబీ అధికారులకు దొరికితే ఇబ్బందులు ఎదురవుతాయనే అప్రమత్తమయ్యారని కాంట్రాక్టర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:21 AM