డివైడర్‌ను ఢీకొన్న బైక్
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:16 AM
పరవాడ- లంకెలపాలెం ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి
ఒకరి దుర్మరణం
పరవాడ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పరవాడ- లంకెలపాలెం ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి స్థానిక సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన కొండపురెడ్డి రామిరెడ్డి (39) కొన్నేళ్ల నుంచి పరవాడ ఫార్మాసిటీలోని రాంకీకి చెందిన కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ (సీడబ్ల్యూఎంపీ)లో ఎక్స్‌కవేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి విశాఖ నగరంలోని కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఫార్మా సిటీలోని లారస్ ల్యాబ్స్ ఫార్మా పరిశ్రమ సమీపంలోకి వెళ్లేసరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నది. దీంతో కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతుడి వివరాలు సేకరించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.