Share News

పర్యాటక ప్రదేశంగా పెద్ద చెరువు

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:39 AM

స్థానిక పెద్ద చెరువు (ట్యాంక్‌ బండ్‌) అభివృద్ధి పనులు పునఃప్రారంభించడానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవ ఫలితంగా రూ.4.5 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.

పర్యాటక ప్రదేశంగా పెద్ద చెరువు
నర్సీపట్నం పెద్ద చెరువు

నర్సీపట్నంలో ట్యాంక్‌ బండ్‌ పనుల పునఃప్రారంభానికి సన్నాహాలు

స్పీకర్‌ అయ్యన్న చొరవతో రూ.4.5 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

త్వరలో టెండర్ల ప్రక్రియ

నర్సీపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక పెద్ద చెరువు (ట్యాంక్‌ బండ్‌) అభివృద్ధి పనులు పునఃప్రారంభించడానికి వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవ ఫలితంగా రూ.4.5 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ గతంలో (2014-19) అధికారంలో వున్నప్పుడు నాడు మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం పెద్ద చెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి స్టేట్‌ హైవే ప్లాన్‌ నిధుల నుంచి ఆర్‌అండ్‌బీ శాఖ రూ.5.7 కోట్లు, పర్యాటక శాఖ నుంచి రూ.95 లక్షలు మంజూరు చేయించారు. 2018 డిసెంబరులో పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2.4 కోట్లతో చెరువు గట్టుకు కాంక్రీట్‌ రక్షణ గోడ, పంట పొలాల వైపు రాతికట్టు, బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేశారు. విద్యుత్‌ దీపాలు, చెరువు గట్టు మీద వాకింగ్‌ ట్రాక్‌, స్టీల్‌ రెయిలింగ్‌ వంటి పనులు మిగిలి పోయాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన నిధులతో జాతీయ నేతలు, స్వాత్రంత్య్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. పెద్ద చెరువు ప్రాంతంలో మిగిలిన అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతోపాటు అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. అనంతరం శాసనసభ స్పీకర్‌గా ఎంపికయ్యారు. ఆయన చొరవతో ట్యాంక్‌ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.4.5 కోట్లు మంజూరు చేసింది. లంబసింగి, చెరువులవేణం, కొత్తపల్లి జలపాతం, తదితర పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారు నర్సీపట్నం ట్యాంక్‌ బండ్‌ చూడడానికి వచ్చేలా సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు ఆకాంక్షిస్తున్నారు. పార్కు, బోట్‌ షికారు, చిన్న పిల్లల ఆట వస్తువులు, వాకింగ్‌ ట్రాక్‌, స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నేతల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా చెరువు మధ్యలో భారీ విగ్రహం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:39 AM