Share News

భౌబోయ్‌ అరుస్తాయ్‌.. కరుస్తాయ్‌

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:32 AM

జిల్లాలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గత నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలో 5,580 మందిని కుక్కలు కరిచాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కుక్కలను నియంత్రించాలని అధికారులు భావిస్తున్నా జంతు సంరక్షణ సంస్థల చర్యలతో వెనుకడుగు వేస్తున్నారు. దీని వలన జనం ఇబ్బందులు పడుతున్నారు.

భౌబోయ్‌ అరుస్తాయ్‌.. కరుస్తాయ్‌
నర్సీపట్నంలో గుంపుగా సంచరిస్తున్న వీధి కుక్కలు

- జిల్లాలో భయపెడుతున్న వీధి కుక్కలు

- గుంపులుగా వీధుల్లో సంచారం

- ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులను వదలని వైనం

- గత నాలుగు నెలల్లో 5,580 మంది బాధితులు

- జంతు సంరక్షణ సంస్థల చర్యలతో కుక్కల నియంత్రణపై అధికారులు వెనుకడుగు

నర్సీపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. గత నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలో 5,580 మందిని కుక్కలు కరిచాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కుక్కలను నియంత్రించాలని అధికారులు భావిస్తున్నా జంతు సంరక్షణ సంస్థల చర్యలతో వెనుకడుగు వేస్తున్నారు. దీని వలన జనం ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో పలు చోట్ల వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. వాహనచోదకులు, పాదచారులను వెంబడిస్తున్నాయి. చిన్నారులను సైతం కరిచేస్తున్నాయి. గత నెలలో ఓ పిచ్చికుక్క రావికమతంలో స్వైరవిహారం చేసి రెండేళ్ల చిన్నారితో సహా 27 మందిపై దాడి చేసి గాయపరిచింది. వీరందరినీ నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. గత నెల 17వ తేదీన పిచ్చికుక్క గొలుగొండ మండలం పాకలపాడు గ్రామంలో ఇద్దర్ని కరిచి, రెట్టవానిపాలెంలో ఒక ఆవు, వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ విధమైన సంఘటన ప్రతి రోజూ ఎదురవుతున్నా పంచాయతీ, మునిసిపల్‌ అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలో 5,580 మందిని కుక్కలు కరిచాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోచ్చు. జంతువులపై క్రూరత్వ నివారణ సంస్థ (ఎస్‌పీసీఏ)లో భాగమైన బ్లూక్రాస్‌ సంస్థ పేరు చెబితే అధికారులు భయపడుతున్నారు. కుక్కలు దాడి చేసి కరిచి గాయపరిచినా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. కుక్కలను పట్టుకునే సమయంలో చిన్న గాయమైనా ఆ సంస్థ కారణంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాటి జోలికి వెళ్లడం లేదు. ఫలితంగా గ్రామాలు, పట్టణాల్లో గ్రామసింహాల బెదడ రోజు రోజుకి పెరిగి పోతోంది. గుంపులు, గుంపులుగా తిరుగుతున్న కుక్కలను చూస్తే రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ద్విచక్రవాహనాలపై వెళ్లే వారిని వెంబడిస్తున్నాయి. దీంతో వేగం పెంచి వాహనచోదకులు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి.

ఈ ఏడాది జూలై నుంచి అక్టోబరు వరకు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో 700 మందికి వైద్యులు యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ వేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు అర్బన్‌ పీహెచ్‌సీలలో 1,841 మందికి వ్యాక్సిన్‌ వేశారు. జిల్లాలో జూలైలో 819, ఆగస్టులో 1,463, సెప్టెంబరులో 1494, అక్టోబరులో 1,804 మంది చొప్పున మొత్తం 5,580 మంది బాధితులు ఉన్నారు. కుక్కలు నివారణకు వాటి సంతానం పెరగకుండా శస్త్ర చిక్కత్సలు చేయడం ఒక్కటే మార్గమని అధికారులు అంటున్నారు. శస్త్ర చికిత్సలు చేసి కాలక్రమేణా కుక్కల బెడద తగ్గించుకోవడం తప్పితే వేరే మార్గం లేదని అంటున్నారు. నర్సీపట్నం మునిసిపాలిటీలో 244, ఎలమంచిలి మునిసిపాలిటీలో 140 పైగా కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయించారు. ఆపరేషన్‌ చేయడానికి ఒక్కొక్క కుక్కకి రూ.1500 ఖర్చు చేశారు. అయితే పంచాయతీల్లో ఇటువంటి ప్రయత్నం ఏమీ చేయడం లేదు. ఖర్చుతో కూడుకున్న పని కావడంతో కుక్కల నివారణకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ వేయడం తప్పితే కుక్కల నివారణకు ఏమీ చేయలేకపోతున్నారు. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హైమావతిని వివరణ కోరగా జిల్లాలో యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్‌ కొరత లేదని తెలిపారు.

Updated Date - Nov 02 , 2025 | 12:32 AM