Share News

ధారాలమ్మ ఘాట్‌లో నిలిచిన భద్రాచలం బస్సు

ABN , Publish Date - Mar 14 , 2025 | 10:37 PM

ఏజెన్సీ మీదుగా ప్రయాణం చేసేవారికి తిప్పలు తప్పడం లేదు. గురువారం భద్రాచలం నుంచి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళుతున్న బస్సు సాంకేతిక లోపాలతో జీకేవీధి మండలం ధారాలమ్మ ఘాట్‌లోని ధర్మాపురం సమీపంలో గల దట్టమైన అటవీప్రాంతంలో నిలిచిపోయింది.

ధారాలమ్మ ఘాట్‌లో నిలిచిన భద్రాచలం బస్సు
నిలిచిపోయిన విశాఖపట్నం డిపోకు చెందిన భద్రాచలం విశాఖపట్నం సర్వీస్‌.

దట్టమైన అడవిలో రెండు గంటలపాటు

బిక్కుబిక్కుమంటూ గడిపిన 60 మంది ప్రయాణికులు

సాంకేతిక లోపాలే కారణం

ప్రయాణికులకు తప్పని అవస్థలు

సీలేరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ మీదుగా ప్రయాణం చేసేవారికి తిప్పలు తప్పడం లేదు. గురువారం భద్రాచలం నుంచి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళుతున్న బస్సు సాంకేతిక లోపాలతో జీకేవీధి మండలం ధారాలమ్మ ఘాట్‌లోని ధర్మాపురం సమీపంలో గల దట్టమైన అటవీప్రాంతంలో నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో విశాఖపట్నం, నర్సీపట్నం, చింతపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. క్లచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం బస్సు ఆగిపోయింది. దీంతో రెండు గంటలపాటు దట్టమైన అడవిలో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం సీలేరు నుంచి అనకాపల్లి వెళ్లే బస్సు రావడంతో నర్సీపట్నం, ఇతర ప్రాంతాలకు వెళ్లే సగం మంది ప్రయాణికులను పంపించారు. మిగతా సగం మందిని భద్రాచలయం నుంచి పాడేరు వెళ్లే బస్సులో చింతపల్లి వరకు పంపించారు. అయితే అనకాపల్లి వెళ్లే బస్సు కూడా ఆర్వీనగర్‌ వద్దకు వెళ్లేసరికి టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఆ బస్సులో కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూరప్రాంతాలకు కండిషన్‌లో లేని డొక్కు బస్సులను నడపడం ఒక కారణం కాగా.. ఆర్వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు గల అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారడం మరో కారణంగా చెప్పవచ్చు. ఈ రూట్లో కండిషన్‌ ఉన్న బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 10:37 PM