గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:08 AM
గిరిజన ప్రాంత ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందని, ఈ క్రమంలోనే చక్కని మార్కెటింగ్ చేసి గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు.
రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశంలో కలెక్టర్ దినేశ్‌కుమార్
ప్రతి నెలా ఎఫ్‌పీవోలతో వర్క్‌షాప్
పాడేరు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంత ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందని, ఈ క్రమంలోనే చక్కని మార్కెటింగ్ చేసి గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు. ఏజెన్సీలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలోని గిరిజన ఉత్పత్తుల్లో కాఫీకి ప్రపంచ గుర్తింపు ఉందని, అదే తరహాలో మిరియాలు, పసుపు పంటకు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే గిరిజన రైతులు దళారీల బారినపడకుండా ఉండేందుకు గిరిజన ప్రాంత ఉత్పత్తుల క్రయవిక్రయాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలు చేపట్టాలని సూచించారు. అలాగే గిరిజన ఉత్పత్తుల్లో రోగనిరోధక శక్తి ఉండడంతో మార్కెట్‌లో గిరాకీ ఉందని, ఈ క్రమంలో నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో ఎక్కువ మంది రైతులను సభ్యులు చేర్చాలని, పంటల ఉత్పత్తి, మార్కెట్ ధరలపైనా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కాఫీ, మిరియాలను గ్రేడింగ్ చేస్తున్నట్టుగా పసుపునకు ప్రోసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు గాను బ్యాంకులు సైతం రుణాలు అందిస్తాయని చెప్పారు. జిల్లాలో ఉన్న ఉత్పత్తులు, ప్రోసెసింగ్ యూనిట్‌ల వివరాలను సేకరించిన అధికారులు తనకు నివేదిక సమర్పించాలన్నారు. ఇకపై ప్రతి నెలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో వర్క్‌షాప్ నిర్వహించి, పంటల సంబంధ అంశాలపై చర్చ, భవిష్యత్తు కార్యాచరణకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, ఐటీడీఏ ఉద్యానవనాధికారి రాజశేఖరం, ఏజెన్సీ ప్రాంతంలోని రైతు ఉత్పత్తిదారు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.