బెత్తెడు వేతనం.. బండెడు చాకిరి
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:42 AM
ఏళ ్ల తరబడి అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న సహకార సంఘాల ఉద్యోగులు వేతనాల పెంపుతోపాటు, ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్లతో ఆందోళనబాట పట్టారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అమలుకు నోచుకోని సహకార ఉద్యోగుల వేతనాల పెంపు (పీఆర్‌సీ).. కూటమి ప్రభుత్వం అయినా అమలు చేయాలని సహకార ఉద్యోగులు కోరుతున్నారు.
అరకొర జీతాలతో సహకార ఉద్యోగుల జీవన పోరాటం
అందరికీ అమలుకాని జీవో 36
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్
ఐదేళ్లకోసారి వేతన సవరణ
గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేత
రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా సదుపాయం
డిమాండ్ల సాధనకు పోరుబాటపట్టిన సహకార ఉద్యోగులు
చోడవరం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏళ ్ల తరబడి అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న సహకార సంఘాల ఉద్యోగులు వేతనాల పెంపుతోపాటు, ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్లతో ఆందోళనబాట పట్టారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అమలుకు నోచుకోని సహకార ఉద్యోగుల వేతనాల పెంపు (పీఆర్‌సీ).. కూటమి ప్రభుత్వం అయినా అమలు చేయాలని సహకార ఉద్యోగులు కోరుతున్నారు.
సహకార సంఘాల ఉద్యోగుల దశాబ్దాల డిమాండ్ మేరకు మెరుగైన వేతనాలు అమలు చేయాలని 2018లో తెలుగుదేశం ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది, ఈ మేరకు అధికారులతో కూడిన కమిటీతో వేతనాల పెంపుపై ప్రత్యేకంగా చర్చించి ఆ మేరకు వేతనాలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీనిని అమలు చేసేలోగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. సహకార ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేస్తామని ప్రకటించి జీవో నంబరు 36 విడుదల చేసింది. దీనిప్రకారం సహకార సంఘాల ఉద్యోగుల వేతనాల్లో ఆప్కాబ్ 30 శాతం, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు 40 శాతం, సహకార సంఘం 20 శాతం చొప్పున భరించి, వేతనాల పెంపును అమలు చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు సూచించింది. జీవో 36 జారీ కావడంతో తమకు సంతృప్తికరమైన వేతనాలు లభిస్తాయని సహకార సంఘాల ఉద్యోగులు ఎంతో సంబరపడ్డారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో ఐదేళ్లపాటు కాగితాలకే పరిమితమైంది. ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో పనిచేస్తున్న సహకార ఉద్యోగులు, జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కానీ లాభాల్లో ఉన్న సహకార సంఘాల్లోని సిబ్బంది మాత్రమే ఈ జీవో ప్రకారం వేతనాలు తీసుకోవాలని డీసీసీబీ అధికారులు మెలిక పెట్టడంతో చాలా కొద్దిమందికి మాత్రమే ఈ జీవో అమలైంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 98 సహకార సంఘాలు ఉండగా ప్రస్తుతం 25-30 సంఘాల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు పెంపు అమలవుతున్నది. సహకార సంఘాల్లో దిగువస్థాయి సిబ్బందికి కనీస వేతనం రూ.11 వేలు కాగా, సీనియారిటీ ఉన్న ఉద్యోగి వేతనం రూ.42 వేలకు మించిలేదని అంటున్నారు. ఎంతోకాలంగా సేవలందిస్తున్నప్పటికీ తమ వేతనాలు అరకొరగానే ఉండడం, మరోవైపు పెరిగిన జీవన ప్రమాణాలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా, అందరికీ వేతనాలు పెంపు జీవో అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఐదేళ్లకోసారి వేతన సవరణ అమలు చేయాలని, ఈలోగా మధ్యంతర భృతి ప్రకటించాలని, గ్రాట్యుటీ సీలింగ్‌ను ఎత్తివేయాలని, రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని, రైతులకు సంబంధించి అన్ని రకాల సేవలను సహకార సంఘాల ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వీటి సాధన కోసం ఆందోళనబాట పట్టిన ఉద్యోగులు ఈ నెల 8వ తేదీన అన్ని కేంద్ర సహకార బ్యాంకుల వద్ద దీక్షలు నిర్వహించారు.
సహకార ఉద్యోగులకు న్యాయం చేయాలి
గొంతిన బాబ్జీ, సహకార సంఘాల ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో విధులు నిర్వహిస్తున్నాం. ఉద్యోగుల వేదనను ప్రభుత్వం అర్ధం చేసుకుని మాకు న్యాయం చేయాలి. అందరికీ జీవో నంబరు 36 ప్రకారం వేతనాలు అమలయ్యేలా చూడాలి. పదవీ విరమణ వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలి. డిమాండ్ల సాధన కోసం 16న సహకార కార్యాలయాల వద్ద, 22 డీసీసీబీల వద్ద ఆందోళనలు చేస్తాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 29న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తాం.