హోలీ జాతరకు బీటాలైన్ ముస్తాబు
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:25 PM
మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం బీటాలైన్ రాధాకృష్ణ ఆలయం హోలీ జాతరకు ముస్తాబైంది. ఆదివాసీలు ప్రతీ ఏడాది హోలీకి ముందు రోజు నుంచి స్థానిక రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలు జరుపుకోవడం అనవాయితీగా వస్తున్నది.

నేడు దహనం చేయనున్న 60 అడుగుల కర్రల పోగు
భారీ సంఖ్యలో తరలిరానున్న భక్తులు, గిరిజనులు
చింతపల్లి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం బీటాలైన్ రాధాకృష్ణ ఆలయం హోలీ జాతరకు ముస్తాబైంది. ఆదివాసీలు ప్రతీ ఏడాది హోలీకి ముందు రోజు నుంచి స్థానిక రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలు జరుపుకోవడం అనవాయితీగా వస్తున్నది. హోలీని పురస్కరించుకుని సంప్రదాయ బద్ధంగా భక్తులు ఆలయం ఎదుట 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన కర్రల పోగును దహనం చేస్తారు. ఈ వేడుకకు పలు గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
తాజంగి పంచాయతీ బీటాలైన్‌లో ఒడిశా నుంచి వలస వచ్చిన 300 కుటుంబాల ఆదివాసీలు సుమారు 85 ఏళ్లుగా నివాసముంటున్నారు. గ్రామంలో రాధాకృష్ణ ఆలయాన్ని నిర్మించుకుని ప్రతి ఏటా హోలీ రోజున పండుగ జరుపుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం ఆలయాన్ని ఆధునికీకరించారు. అయితే బీటాలైన్ ఆదివాసీలు విభిన్నంగా జరుపుకునే హోలీ వేడుక పూర్వం నుంచి కొనసాగుతున్నది. ఈ ఏడాది హోలీ వేడుకలకు రాధాకృష్ణ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గురువారం రాత్రి భక్తుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
నేడు హోలీ సంబరం
శుక్రవారం వేకువజాము నాలుగు గంటలకు హోలీ సంబరం నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 60 అడుగుల కర్రల పోగును సిద్ధం చేశారు. ఈ కర్రల పోగును ఉదయం నాలుగు గంటలకు కాలుస్తారు. ఈ కర్రల పోగుపై ఒక జెండాను ఎగురవేస్తారు. ఈ జెండాను పట్టుకోవడానికి కర్రల పోగు చుట్టూ భక్తులు నిరీక్షిస్తుంటారు. కర్రల పోగు కాలిపోయి జెండా గాలిలోకి ఎగురుతుంది. ఈ జెండాను పట్టుకున్న వ్యక్తిని భక్తులందరూ ఎత్తుకుని అతని గృహం వరకు గిరిజన సంప్రదాయ నృత్య కళా ప్రదర్శనలతో తీసుకొస్తారు. జెండాను పట్టుకున్న వ్యక్తికి ఆలయ కమిటీ నగదు బహుమతిగా రూ.1,116 అందజేయనున్నట్టు కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ జెండాను పట్టుకున్న కుటుంబానికి ఏడాదంతా శుభం జరుగుతుందని స్థానిక భక్తుల నమ్మకం. ఈ ప్రాంత గిరిజనులందరూ ఈ జెండా పట్టుకున్న వ్యక్తితోనే రానున్న ఖరీఫ్ సాగులో విత్తనాల నాట్లు వేయిస్తారు. ఇలా చేస్తే అధిక దిగుబడులు వస్తాయనేది ఆదివాసీల విశ్వాసం.