Share News

విద్యా బోధనలో బెస్ట్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:38 AM

స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా నిర్వహిస్తున్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది.

విద్యా బోధనలో బెస్ట్‌
పంట పొలంలో కూరగాయల మొక్కల్లో కలుపు తొలగిస్తున్న విద్యార్థులు

అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో బోధన, వెనువెంటనే ప్రాక్టికల్స్‌

అగ్రిసెట్‌లో సత్తా చాటుతున్న విద్యార్థులు

ఏటా ఏజీ బీఎస్సీలో ఐదు నుంచి ఏడు సీట్లు కైవసం

అరుదైన పంటలపై విద్యార్థులు ప్రయోగాలు

రాష్ట్రంలోనే ఏకైన ఆర్గానిక్‌ కళాశాల

చింతపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా నిర్వహిస్తున్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది. నాణ్యమైన విద్యతో పాటు అరుదైన పంటలపై ప్రాక్టికల్స్‌ చేయిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. ఏటా అగ్రిసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఇక్కడి విద్యార్థులు ఏజీబీఎస్సీలో ఐదు నుంచి ఏడు సీట్లు సాధిస్తున్నారంటే శిక్షణ ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలోనే ఏకైక ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల కావడంతో ఇక్కడ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు 2011లో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. 2016లో ఈ కళాశాలను ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలగా మార్పు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల చింతపల్లిలో మాత్రమే ఉంది. ఈ కళాశాలలో 25 సీట్లు కేటాయించారు. కళాశాలలో చేరిన విద్యార్థులు రెండేళ్ల డిప్లొమా కోర్సు చేస్తారు. పదవ తరగతి అర్హత కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కళాశాలలో విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరు వసతి గృహాలు, క్యాంటీన్‌ ఉన్నాయి. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థినీ, విద్యార్థులు త్వరగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కోర్సును ఎంపిక చేసుకుంటున్నారు.

నాణ్యమైన విద్యాబోధన

కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుంది. కళాశాలలో పాఠ్యాంశాలు బోధించేందుకు ఒక టీచింగ్‌ అసోసియేట్‌, ముగ్గురు టీచింగ్‌ అసిస్టెంట్లు అందుబాటులో ఉన్నారు. బోధన సిబ్బందితో పాటు శాస్త్రవేత్తలు సైతం అదనపు తరగతులను బోధిస్తున్నారు. కళాశాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఆవరణలో ఉండడంతో శాస్త్రవేత్తలు చేపడుతున్న పరిశోధనలు, ప్రయోగాలను విద్యార్థులు స్వయంగా పరిశీలించి నేర్చుకునే వెసులుబాటు ఉంది. పరిశోధన స్థానంలో అరుదైన పంటలను శాస్త్రవేత్తలు సాగు చేస్తున్నారు. ఈ పంటలను స్వయంగా పరిశీలించి విద్యార్థులు నేర్చుకునే అవకాశం కలిగింది. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న వ్యవసాయ పాఠ్యాంశాలను వెనువెంటనే ఫీల్డ్‌లో ప్రాక్టికల్‌ చేస్తున్నారు. విద్యార్థులు ఉదయం తరగతి గదిలోనూ, మధ్యాహ్నం ఫీల్డ్‌లో వ్యవసాయ విద్యను నేర్చుకుంటున్నారు. మూడో సెమిస్టర్‌లో విద్యార్థులే స్వయంగా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పంటలను పండించాల్సి వుంది. దీంతో స్థానిక కళాశాలలో అగ్రికల్చర్‌ డిప్లొమా చేసిన విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు ప్రాక్టికల్‌ విద్య పూర్తి స్థాయిలో నేర్చుకోగలుగుతున్నారు.

అగ్రిసెట్‌లో ఉత్తమ ఫలితాలు

కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతి ఏడాది అగ్రిసెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. కళాశాలలో ఐదేళ్లగా రాష్ట్ర స్థాయి అగ్రి సెల్‌లో స్థానిక కళాశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రథమ ర్యాంక్‌ సాధిస్తున్నారు. 2016 నుంచి ప్రతి ఏడాది పదిలోపు ర్యాంకులను కళాశాలకు చెందిన విద్యార్థులు అధికంగా సొంతం చేసుకుంటున్నారు. ప్రతి ఏడాది ఐదు నుంచి ఏడుగురు విద్యార్థులు అగ్రిసెట్‌లో సీట్లు సాధిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో ఐదుగురు విద్యార్థులు, ప్రైవేటు కళాశాలలో ఇద్దరు విద్యార్థులు ఏజీబీఎస్సీ సీట్లు సాధించారు. ఈ ఏడాది ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలోనూ, ఇద్దరు విద్యార్థులు ప్రైవేటు కళాశాలలోనూ ఏజీ బీఎస్సీ సీట్లు సాధించారు.

Updated Date - Nov 25 , 2025 | 12:38 AM