నియంత్రణలో బెర్రీ బోరర్
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:49 PM
గిరిజన ప్రాంతంలో కాఫీ బెర్రీ బోరర్ కీటకం పూర్తిగా నియంత్రణలో ఉందని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ చెట్టి బిందు తెలిపారు.
యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం
చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌కు అరకులోయ నుంచి కాఫీ పండ్లను తీసుకురావద్దని సూచించాం
ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి బిందు
చింతపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో కాఫీ బెర్రీ బోరర్ కీటకం పూర్తిగా నియంత్రణలో ఉందని స్థానిక ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ చెట్టి బిందు తెలిపారు. మంగళవారం రేగుబయలు గ్రామంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న కాఫీ తోటలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిసారిగా గిరిజన ప్రాంతంలో అరకులోయ మండలం పెదలబుడు, చినలబుడు పంచాయతీలతోపాటు స్థానిక ఉద్యాన పరిశోధన స్థానంలో కాఫీ బెర్రీ బోరర్ కీటకం కనిపించిందన్నారు. ఈ కీటకం కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలో మాత్రమే ఉందన్నారు. గిరిజన ప్రాంతంలోనూ ఈ కీటకం కనిపించడం వలన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టిందన్నారు. కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పర్యవేక్షణలో ఉద్యాన, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు, అధికారులు, ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారులు, క్షేత్ర స్థాయి ఉద్యోగులు నివారణ చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రధానంగా అరకులోయలో 180 ఎకరాల్లో ఈ కీటకం ఉధృతి కనిపించిందన్నారు. గిరిజన ప్రాంత రైతులు ఆర్గానిక్ పద్ధతిలో కాఫీ పంటను సాగు చేస్తున్నారన్నారు. ఈ మేరకు జీవసిలింద్రనాసిని బ్యూవెరియా బస్యానా తోటలకు పిచికారీ చేసి కీటకాన్ని నియంత్రించినట్టు చెప్పారు. బ్యూవేరియా బస్యానా 500 కిలోలు ఐటీడీఏకు అందజేశామన్నారు. ఐదు గ్రాములు ఒక లీటరు నీటికి కలుపుకొని, ఎకరాకు 200 లీటర్లు పిచికారీ చేశామన్నారు. వెంకటరామన్నగూడెం విశ్వవిద్యాలయంలోనూ బ్యూవేరియా బస్యానా జీవసిలింద్రనాసినిని భవిష్యత్తు అవసరాల కోసం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారన్నారు. అరకులోయ ప్రాంతంలో కాఫీ బెర్రీ బోరర్ కీటకం ఆశించడం వలన కాఫీ పండ్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం మంచిదికాదన్నారు. ఐటీడీఏ నిర్వహణలో ఉన్న చింతపల్లి ఎకో పల్పింగ్ యూనిట్‌కు అరకులోయ నుంచి కాఫీ పండ్లను పల్పింగ్‌కు తీసుకురావద్దని నిర్వాహకులకు సూచించామని చెప్పారు. కాఫీ పండ్లను ఈ ప్రాంతానికి తీసుకొస్తే కీటకం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.