కాఫీ తోటలకు బెర్రీ బోరర్ బెడద
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:44 AM
గిరిజన ప్రాంతంలో తొలిసారిగా కాఫీ తోటల్లో బెర్రీ బోరర్ తెగులును కేంద్ర కాఫీ బోర్డు అధికారులు, శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ప్రమాదకరమైన ఈ తెగులు వలన తోటలు పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ పదకొండు మండలాల్లో కాఫీ బెర్రీ బోరర్ తెగులును గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ఈ తెగులుపై గిరిజన రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.
- గిరిజన ప్రాంతంలో తొలిసారిగా బయటపడిన ప్రమాదకరమైన తెగులు
- విస్తరిస్తే తోటలు పూర్తిగా నాశనం
- సంరక్షణ చర్యలు ప్రారంభించిన కేంద్ర కాఫీ బోర్డు అధికారులు
- గిరిజన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన
చింతపల్లి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో తొలిసారిగా కాఫీ తోటల్లో బెర్రీ బోరర్ తెగులును కేంద్ర కాఫీ బోర్డు అధికారులు, శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ప్రమాదకరమైన ఈ తెగులు వలన తోటలు పూర్తిగా నాశనమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ పదకొండు మండలాల్లో కాఫీ బెర్రీ బోరర్ తెగులును గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. ఈ తెగులుపై గిరిజన రైతులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 2.58 లక్షల ఎకరాల్లో 2.45 లక్షల మంది రైతులు, ఏపీఎఫ్‌డీసీ 10,025 ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు. తాజాగా పాడేరులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు చేపట్టాలని, అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న కాఫీకి పెద్దగా చెప్పుకోదగిన తెగుళ్లు, చీడపీడలు ఆశించిన దాఖలాలు లేవు. కాండం తొలుచు పురుగు, ఆకుమచ్చ తెగులు సహజంగా కాఫీ తోటల్లో కనిపించినా రైతులు నివారణ చర్యలు చేపట్టడంతో సమస్య తగ్గుముఖం పడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా కాఫీ పంటను తీవ్ర స్థాయిలో నాశనం చేసే కాఫీ బెర్రీ బోరర్ తెగులు బయటపడడంతో కేంద్ర కాఫీ బోర్డు అధికారులు, శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
గిరిజన ప్రాంతంలో కాఫీ బెర్రీ బోరర్ ప్రప్రథమం
పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధి అరకులోయ చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలో ప్రప్రథంగా కాఫీ బెర్రీ బోరర్ తెగులు వ్యాప్తి చెందినట్టు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. పనకకుడి గ్రామంలోని కాఫీ బెర్రీ బోరర్ తెగులు వ్యాప్తి చెందిన సిరగం సువర్ణ తోటలోని కాఫీ కాయలను వెంటనే సేకరించి వేడి నీళ్లలో ముంచి కీటకాలను నాశనం చేసే పనులను ప్రారంభించారు. అలాగే పకనకుడి, మాలిసింగరం, మాలివలస, తుర్రయిగూడ, మంజగూడ గ్రామాల్లో కాఫీ తోటలను క్వారంటైన్ చేసేందుకు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పండిన కాఫీ గింజలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి, దిగుమతులను పూర్తిగా నిషేధించారు. ఐదు గ్రామాల్లో పండిన కాఫీ గింజలను సేకరించి స్థానికంగా పార్చిమెంట్ తయారు చేయాలని నిర్ణయించారు. ఈ గింజలను ఇతర ప్రాంతాలకు తరలించడం వలన తెగులు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుందని, ప్రాథమిక స్థాయిలోనే పూర్తిగా కాఫీ బెర్రీ బోరర్ కీటకాలను నాశనం చేయాలని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఏజెన్సీ పదకొండు మండలాల్లో ఎక్కడైనా కాఫీ బెర్రీ బోరర్ తెగులు ఉందా? అనే అంశాలను గుర్తించేందుకు రెండు రోజులుగా జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగల ప్రాంతాల్లో కేంద్ర కాఫీ బోర్డు జేఎల్‌వో రమేశ్‌తో కలిసి సీసీఆర్‌ఐ, ఆర్‌వీనగర్ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎంఎస్ ఉమ, కె.టింటిమోల్, డి. సునీల్‌బాబు రైతులు కాఫీ తోటలను పరిశీలిస్తూ ప్రత్యేక సర్వే చేపడుతున్నారు.