వానరమూకతో బెంబేలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:44 AM
పట్టణంలో వానన మూకల బెడద నానాటికీ పెరిగిపోతున్నది. కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఎలమంచిలి వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కోతులు
ఇళ్లలోకి చొరబడి సామాగ్రి ధ్వంసం
అడ్డుకుంటే మూకుమ్మడిగా దాడి
భయాందోళన చెందుతున్న పిల్లలు, మహిళలు, వృద్ధులు
పట్టించుకోని మునిసిపల్, అటవీ శాఖల అధికారులు
ఎలమంచిలి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో వానన మూకల బెడద నానాటికీ పెరిగిపోతున్నది. కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆ వీధి.. ఈ వీధి.. అన్న తేడా లేకుండా అన్నిచోట్లా స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇంటి నుంచి వీధిలోకి రావాలంటే భయపడుతున్నారు. వీటి ఆగడాలు నానాటికీ శ్రుతి మించుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో సుమారు ఆరేళ్ల నుంచి కోతుల బెడద వున్నప్పటికీ అధికారులు, మునిసిపల్ పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పిల్లలు, పెద్దవి కలిపి పది నుంచి ఇరవై వరకు కోతులు ఇళ్లలోకి చొరబడి సామగ్రిని పాడుచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఎవరైనా వారించడానికి సాహసం చేస్తే మూకుమ్మడిగా దాడిచేస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని రామ్‌నగర్, మిలట్రీ కాలనీ, నాగేంద్ర కాలనీ, కొత్తపేట, ఏఎస్‌ఆర్ కాలనీ, కోర్టుపేట, రైల్వేస్టేషన్ రోడ్డు ప్రాంతాల్లో కోతుల సంచారం అధికంగా వుంది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం మునిసిపల్ అధికారులు పట్టణంలో కోతుల పట్టివేత కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతకాలంపాటు వీటి బెడద లేదు. తరువాత క్రమేణా మళ్లీ కోతుల రాక పెరిగింది. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కోతులను పట్టించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాలి. కానీ ఈ విషయంలో మునిసిపల్, అటవీ శాఖల అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే విజయ్‌కుమార్ ఇటీవల పట్టణంలో పర్యటించిన సందర్భంగా కోతులు అధికంగా వుండడాన్ని గమనించారు. వీటి సమస్య లేకుండా చూడాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. కానీ ఇంతవరకు వారిలో కదలిక లేదు.