Share News

ఐదు నెలలుగా చదువుకు దూరం

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:20 AM

మండలంలోని అగ్రహారం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఐదు నెలలుగా విద్యకు దూరమయ్యారు. పాఠశాలకు ఉపాధ్యాయిని రాకపోవడం, విద్యాశాఖాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

ఐదు నెలలుగా చదువుకు దూరం
ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతున్న అగ్రహారం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు

టీచర్‌ విధులకు హాజరుకాక ఇబ్బందులు

ఉదయం స్కూల్‌కు వచ్చి ఆడుకుని వెళ్లిపోతున్న విద్యార్థులు

అగ్రహారం ఎంపీపీ స్కూల్‌కు ఉపాధ్యాయుడిని నియమించాలని తల్లిదండ్రుల వేడుకోలు

గూడెంకొత్తవీధి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అగ్రహారం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఐదు నెలలుగా విద్యకు దూరమయ్యారు. పాఠశాలకు ఉపాధ్యాయిని రాకపోవడం, విద్యాశాఖాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అగ్రహారం ఎంపీపీ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు 20 మంది విద్యార్థినీ, విద్యార్థులు చదువుతున్నారు. జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ఆగస్టులో ప్రశాంతికుమారి అనే టీచర్‌ను విద్యాశాఖాధికారులు ఈ పాఠశాలకు నియమించారు. ఆమె రెండు రోజుల పాటు పాఠశాలకు వచ్చారు. అనంతరం సెలవుపై వెళ్లిన ఆమె ఇప్పటి వరకు పాఠశాలకు రాలేదు. అప్పటి నుంచి ప్రతి రోజు విద్యార్థులు పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసి వెళ్లిపోతున్నారు. టీచర్‌ లేకపోవడంతో పాఠశాలలో ఆడుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు. ఐదు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికైనా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారి స్పందించి అగ్రహారం ఎంపీపీ పాఠశాలకు టీచర్‌ను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:20 AM