పశుమాంసం విక్రయశాలలపై దాడులు
ABN , Publish Date - Nov 06 , 2025 | 01:23 AM
నగరంలో అనధికారికంగా నిర్వహిస్తున్న పశువధశాలల (కబేళాలు)పై జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆరిలోవ, రైల్వేన్యూకాలనీ, గాజువాక, వన్‌టౌన్ తదితర ప్రాంతాల్లో గోవులను వధించి, మాంసాన్ని నగరంలోని దుకాణాలతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండడంపై బుధవారం ‘గోవధ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జీవీఎంసీ ప్రధాన పశు వైద్యాధికారి డాక్టర్ రవిరాజు తన సిబ్బందితో ఆరిలోవలో తనిఖీలు చేశారు. ఉదయం ఏడు గంటలకే అధికారులు వెళ్లడంతో కబేళాలు నిర్వహిస్తున్న గోడౌన్లు అన్నీ మూసివేసి ఉన్నాయి.
ఐదు చోట్ల ఆవు మాంసం విక్రయిస్తున్నట్టు గుర్తింపు
సుమారు 600 కిలోలు స్వాధీనం
రూ.1,500 చొప్పున జరిమానా విధింపు
మరోసారి పట్టుబడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
విశాఖపట్నం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి):
నగరంలో అనధికారికంగా నిర్వహిస్తున్న పశువధశాలల (కబేళాలు)పై జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఆరిలోవ, రైల్వేన్యూకాలనీ, గాజువాక, వన్‌టౌన్ తదితర ప్రాంతాల్లో గోవులను వధించి, మాంసాన్ని నగరంలోని దుకాణాలతో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండడంపై బుధవారం ‘గోవధ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జీవీఎంసీ ప్రధాన పశు వైద్యాధికారి డాక్టర్ రవిరాజు తన సిబ్బందితో ఆరిలోవలో తనిఖీలు చేశారు. ఉదయం ఏడు గంటలకే అధికారులు వెళ్లడంతో కబేళాలు నిర్వహిస్తున్న గోడౌన్లు అన్నీ మూసివేసి ఉన్నాయి. పశు మాంసం విక్రయించే ఐదు దుకాణాల్లో తనిఖీ చేయగా సుమారు 600 కిలోలు వరకూ ఆవు మాంసం లభ్యమైంది. వారికి ఆ మాంసం ఎక్కడి నుంచి వచ్చిందని అధికారులు ప్రశ్నించారు. తాము పశువులను వధించడం లేదని, ఇతర ప్రాంతాల నుంచి మాంసం వస్తోందని దుకాణదారులు చెప్పారు. ఒక్కో దుకాణానికి రూ.1,500 చొప్పున ఐదు దుకాణాలకు రూ.7,500 జరిమానా విధించారు. సీజ్ చేసిన ఆవు మాంసాన్ని కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ గోతిలో పాతిపెట్టించారు. నగరంలో మారికవలస వద్ద మాత్రమే అధికారిక కబేళా ఉందని, అక్కడ కూడా ఆవులను వధించడం నిషేధమని వ్యాపారులకు డాక్టర్ రవిరాజు వివరించారు. ఎవరైనా అనధికారికంగా కబేలా నిర్వహించినా, ఆవులను వధించినా, ఆవు మాంసం విక్రయించినా క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై నగరంలో కబేళాలు, పశువుల మాంసం విక్రయించే దుకాణాలను తరచూ తనిఖీ చేస్తామని, ప్రజారోగ్యానికి హాని కలిగించే మాంసం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని డాక్టర్ రవిరాజు స్పష్టంచేశారు.