మంచంపట్టిన నేరేడుబంద
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:52 AM
మండలంలోని చీమలపాడు పంచాయతీ శివారులో కొండ శిఖర గిరిజన గ్రామం నేరేడుబందలో పలువురు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 60 మంది జనాభా వున్న ఈ గ్రామంలో వివిధ కుటుంబాలకు చెందిన 13 మంది జ్వరంతో బాధపడుతున్నారు.
కొండశిఖర గిరిజన గ్రామంలో పలువురికి జ్వరాలు
ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో నర్సీపట్నం ఆస్పత్రికి తరలింపు
గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు
ముగ్గురికి మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ
మిగిలిన వారికి సాధారణ జ్వరం, కీళ్లనొప్పులు, జలుబు
రావికమతం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చీమలపాడు పంచాయతీ శివారులో కొండ శిఖర గిరిజన గ్రామం నేరేడుబందలో పలువురు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 60 మంది జనాభా వున్న ఈ గ్రామంలో వివిధ కుటుంబాలకు చెందిన 13 మంది జ్వరంతో బాధపడుతున్నారు. వీరిలో పాంగి అంకిత (10), పాంగి అభిషేక్ (7), కిల్లో సుందరరావు (15), డిప్పల శివాజీ (18), కిల్లో కమల (4), సీదిరి రత్నం(45), పాంగి సాయి (8), కిల్లో ప్రభాస్ (7), కె.భాస్కరరావు(7), సీదిరి బొంజిబాబు (12), విష్ణు (16), పాంగి రష్మిత(12) వున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న కిల్లో ప్రభాస్‌ను కుటుంబ సభ్యులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నేరేడుబందలో జ్వరాలు ప్రబలినట్టు సమాచారం అందుకున్న కొత్తకోట పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది గురువారం గ్రామానికి వెళ్లి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో అందరికీ ఆర్‌డీటీ పరీక్షలు నిర్వహించారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిల్లో ప్రభాస్‌కు మలేరియా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని వైద్య సిబ్బంది చెప్పారు. గ్రామంలో వున్న వారిలో మరో ఇద్దరికి మలేరియా నిర్ధారణ అయ్యిందని, మిగిలిన వారు సాధారణ జ్వరం, కీళ్లనొప్పులు, జలుబుతో బాధపుడున్నట్టు హెచ్‌ఎస్ రమణ చెప్పారు.