Share News

అందాల జలపాతం.. అభివృద్ధి శూన్యం

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:00 PM

ప్రకృతి అందాల నడుమ మనోహరంగా ఉండే గాదిగుమ్మి జలపాతం అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. కార్తీక మాసంలో పర్యాటకులతో కిటకిటలాడే జలపాతం పరిసరాలు ప్రస్తుతం అధ్వానంగా మారాయి.

అందాల జలపాతం.. అభివృద్ధి శూన్యం
ఉరకలేస్తున్న గాదిగుమ్మి జలపాతం

కార్తీక మాసంలో గాదిగుమ్మి జలపాతం కిటకిట

రక్షణ చర్యలు చేపట్టని అధికారులు

తరచూ ప్రమాదాలు

నిర్వహణ లేక పరిసరాలు అధ్వానం

కొయ్యూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి అందాల నడుమ మనోహరంగా ఉండే గాదిగుమ్మి జలపాతం అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. కార్తీక మాసంలో పర్యాటకులతో కిటకిటలాడే జలపాతం పరిసరాలు ప్రస్తుతం అధ్వానంగా మారాయి. గత రెండేళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి చర్యలు చేపట్టకపోవడంతో పాటు రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో పర్యాటకులు ప్రమాదాలకు గురవుతున్నారు.

కృష్ణాదేవిపేట- శరభన్నపాలెం మార్గంలో వలసం పేట సమీపంలోని గిరిజా సమేత తాండవేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి సుమారు కిలోమీటరు వెళితే ఈ సుందర జలపాతం వస్తుంది. ఈ జలపాతం నీరే తాండవ రిజర్వాయర్‌లోకి వెళుతుంది. కార్తీక మాసం వచ్చిందంటే ఇక్కడికి రావడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇక్కడ సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వలన జలపాతంలో స్నానం చేస్తూ కొందరు పర్యాటకులు మృతి చెందారు. రెండేళ్ల క్రితం వరకు సుమారు 42 మంది పర్యాటకులు ఇక్కడ మృతి చెందారు. ఈ జలపాతం దిగువన రెండు బండరాళ్లు ఉన్నాయి. ప్రమాదవశాత్తూ జారిపడితే ఈ రాళ్ల మధ్యలో చిక్కుకుని మృతి చెందుతున్నారు. వాస్తవానికి దశాబ్దం క్రితం అప్పటి ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు రక్షణ చర్యలు చేపట్టినప్పటికి కొన్ని కారణాల వలన పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఈ పనులకు కదలిక లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు రెవెన్యూ, పోలీస్‌ అధికారులు హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే పర్యాటకులు సేదతీరేందుకు నిర్మించిన హట్‌లు(షెడ్లు) నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. ఇప్పటికైనా ఈ జలపాతం అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 11:00 PM