బీచ్‌రోడ్డుకు సొబగులు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:24 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పారిశ్రామిక పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు (సీఐఐ) నేపథ్యంలో బీచ్‌రోడ్డుకు అదనపు సొబగులు అద్దుతున్నారు.
సీఐఐ సదస్సు సందర్భంగా సుందరీకరణ పనులు
ఆర్‌కే బీచ్‌లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు
ప్రతినిధుల కోసం 800కి పైగా కార్లు
సేకరణలో నిమగ్నమైన రవాణాశాఖ అధికారులు
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పారిశ్రామిక పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు (సీఐఐ) నేపథ్యంలో బీచ్‌రోడ్డుకు అదనపు సొబగులు అద్దుతున్నారు. బీచ్‌రోడ్డు పొడుగునా పచ్చదనం ఉట్టిపడేలా అందమైన పూలమొక్కలను నాటుతున్నారు. మరోవైపు సెంటర్ డివైడర్లకు ఉన్న గ్రిల్స్‌కు రంగులు, కూడళ్లలో కొత్తగా వాటర్‌ఫౌంటెయిన్‌లు ఏర్పాటు వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా బీచ్‌రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కురుసుర మ్యూజియంలోని సబ్‌మెరైన్‌కు రంగులు వేస్తున్నారు.
రాత్రిపూట బీచ్‌ఒడ్డున కూర్చొని ఎగసిపడుతున్న అలలను వీక్షించేందుకు వీలుగా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్కేబీచ్ వద్ద తీరంలో నాలుగుచోట్ల ఎత్తైన స్తంభాలను వేసి, వాటిపై అధిక కాంతినిచ్చే హైమాస్ట్‌లైట్లను ఏర్పాటుచేస్తున్నారు. రాత్రివేళ ఇసుకతెన్నెలను ముద్దాడే అలలు సందర్శకులు, పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయని చెబుతున్నారు. కాగా బీచ్‌లో ఏర్పాటు చేస్తున్న హైమాస్ట్ లైట్లను ఆదివారం రాత్రి మేయర్ పీలా శ్రీనివాసరావు పరిశీలించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా, సముద్రం అందాలు సాక్షాత్కరించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం 800కి పైగా కార్లు అందుబాటులో ఉంచాలని రవాణాశాఖ అధికారులకు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. ఇందులో 600 ఇన్నోవా, వందకుపైగా ఫైవ్‌సీటర్ సెడాన్‌కార్లు, సదస్సుకు హాజరయ్యే ప్రముఖులు, పారిశ్రామికవేత్తల కోసం 30 బెంజ్‌లు, 30 బీఎండబ్ల్యూ కార్లు కావాలని ఇండెంట్‌పంపింది. వీటితోపాటు 15 బస్సులు, వీఐపీల కాన్వాయ్ కోసం 50 వరకు అదనపు కార్లు అవసరమని భావిస్తున్నారు. ఈమేరకు వాటిని సమకూర్చుకోవడంలో రవాణాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
ఇన్నోవా, సెడాన్‌కార్లు నగరంతోపాటు అనకాపల్లి, విజయనగరం జిల్లాలోని ట్రావెల్స్ నిర్వాహకుల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ, బెంజ్, బీఎండబ్ల్యూ కార్ల కోసం వెతుకుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఉభయ గోదావరి, విజయవాడ, గుంటూరు జిల్లాల నుంచి వాటిని సమకూర్చుకోవడంపై దృష్టిసారించారు. ఎయిర్‌పోర్టులో దిగిన ప్రతినిధులను కేటాయించిన హోటళ్లకు, అక్కడి నుంచి సదస్సు జరిగే ప్రాంగణానికి తీసుకెళ్లడం కోసం కార్లను కేటాయిస్తున్నారు. సదస్సుకు ముందురోజు అంటే 13 నుంచి 15 వరకు కార్లను అద్దు ప్రాతిపదికన సమకూర్చుకుంటున్నట్టు రవాణాశాఖ ఉపకమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
భాగస్వామ్య సదస్సు పనుల్లో వేగం పెంచాలి
కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) :
ఈ నెల 14, 15 తేదీల్లో నగరంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న పనులను జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి ఆదివారం పరిశీలించిన ఆయన వివిధ విభాగాల అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమయం చాలా తక్కువ ఉందని, పనుల్లో వేగం పెంచాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని, నిర్ణీత సమయం కంటే ముందుగా పనులు పూర్తిచేయాలన్నారు. ప్రధానవేదిక, స్వాగత ద్వారాలు, అతిథుల రాక, పార్కింగ్ వసతి తదితర అంశాలపై సూక్ష్మస్థాయి పరిశీలన చేసిన ఆయన పలు ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులపై అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడా గ్యాప్ రావడానికి వీల్లేదన్నారు. ఈ క్రమంలో జీవీఎంసీ సీఈకి పలు అంశాల్లో మార్పుచేర్పులపై ఆదేశాలు జారీచేశారు. పర్యటనలో డీసీపీ మణికంఠ చందోలు, సీఎంవో నరేష్ కుమార్, సీఐఐ ప్రతినిధి మౌళి, అధికారులు పాల్గొన్నారు.