Share News

అడ్డగోలుగా బీచ్‌ రెస్టారెంట్లు

ABN , Publish Date - Oct 22 , 2025 | 01:23 AM

విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు చేపడతారా?, లేదా?...అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అడ్డగోలుగా బీచ్‌ రెస్టారెంట్లు

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

కమిటీ విచారణలో నిర్ధారణ

తగిన అనుమతులు కూడా కూడా లేవు

కోర్టుకు జీవీఎంసీ నివేదిక

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో అక్రమ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు చేపడతారా?, లేదా?...అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వారికి వత్తాసు పలకడమే దీనికి కారణం. గత రెండేళ్లుగా కొన్ని రెస్టారెంట్లపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పర్యాటక శాఖ అధికారులు విచారణ చేయించినా చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత ప్రత్యేకంగా నియమించిన కమిటీ కూడా వాటిపై సర్వే చేసి నివేదిక సమర్పించింది. నిర్వాహకులకు సమాధానం చెప్పుకొనే అవకాశం ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు ఆ పని కూడా పూర్తిచేశారు. వారి వివరణలను కోర్టుకు సమర్పించారు. అక్కడ తీర్పు ఏమి వస్తే దాని ప్రకారం అధికారులు చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

తొట్లకొండలో ఏపీటీడీసీ నుంచి లీజుకు తీసుకున్న భూమిలో వైసీపీ నాయకుల బృందం అడ్డగోలుగా సీఆర్‌జెడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ‘శాంక్టమ్‌ బీచ్‌ రిసార్ట్స్‌’ పేరుతో నిర్మాణాలు చేపట్టి గదులను అద్దెకు ఇస్తోంది. పర్యాటక శాఖ తీసుకున్న ఎక్సైజ్‌ లైసెన్స్‌ను అడ్డం పెట్టుకొని ఎక్కువ ధరకు మద్యం అమ్ముతోంది. లీజు నిబంధనలకు వ్యతిరేకంగా సబ్‌ లీజుకు తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. వీటిపై అప్పటి జిల్లా పర్యాటక శాఖాధికారిణి జ్ఞానవేణి విచారణ నిర్వహించి గత ఏడాది సెప్టెంబరులో జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని అందులో పేర్కొన్నారు. అలాగే భీమిలి సమీపాన ఏపీటీడీసీకి చెందిన మేర్లిన్‌ క్లే రెస్టోబార్‌ను కూడా లీజుకు ఇచ్చారు. అక్కడ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో బీచ్‌ రిసార్ట్స్‌, బీజాగ్‌ రెస్టో బార్‌, విరాగో రెస్టోబార్లు సీఆర్‌జెడ్‌ అనుమతులు, జీవీఎంసీ ప్లాన్‌ అప్రూవల్‌ లేకుండా నిర్మాణాలు చేపట్టారు. వీటిని స్వయంగా పరిశీలించి సర్వే చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ అన్నీ సీఆర్‌జెడ్‌-3లోని నాన్‌ డెవలప్‌మెంట్‌ జోన్‌లో ఉన్నాయని స్పష్టంగా నివేదిక ఇచ్చింది. దాంతో జీవీంఎసీ అధికారులు వారందరికీ నోటీసులు జారీ చేసి వివరణలు కోరారు.

నిర్మాణాలకు తీసుకున్న అనుమతులు, ఏపీసీజెడ్‌ఎంఏ ఇచ్చిన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు, ఆ స్థలం యాజమాన్య హక్కులపై రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఈసీ, కేంద్ర అటవీ పర్యావరణ, వాతావరణ మార్పుల సంస్థ నుంచి ఎన్‌ఓసీ, జీవీఎంసీ అగ్నిమాపక విభాగం నుంచి ఎన్‌ఓసీ, ఇతర శాఖల నుంచి తీసుకున్న అనుమతులను సమర్పించాలని కోరారు. అయితే ఇవేమీ లేకుండానే వారంతా వ్యాపారాలు చేయడంతో సరైన పత్రాలు ఇవ్వలేకపోయారు. అదే విషయాన్ని స్పష్టంచేస్తూ జీవీఎంసీ అధికారులు కోర్టుకు సమర్పించారు. అక్కడ వెలువడే తీర్పును బట్టి ఆయా రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటారు.

Updated Date - Oct 22 , 2025 | 01:23 AM