Share News

అన్నవరంలో బీచ్‌ రిసార్ట్స్‌

ABN , Publish Date - May 13 , 2025 | 01:09 AM

భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలో ఏపీ పర్యాటక ప్రాధికార సంస్థ (ఏపీటీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం 18.7 ఎకరాలు కేటాయించింది.

అన్నవరంలో బీచ్‌ రిసార్ట్స్‌

  • కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా...

  • ఏపీ పర్యాటక ప్రాధికార సంస్థకు 18.7 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

  • మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలని గడువు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలో ఏపీ పర్యాటక ప్రాధికార సంస్థ (ఏపీటీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం 18.7 ఎకరాలు కేటాయించింది. ఉచితంగా అందజేసిన ఈ భూమిలో ఆ సంస్థ భారీ కన్వెన్షన్‌ సెంటర్‌తో పాటు బీచ్‌ రిసార్ట్స్‌ నిర్మించాలని సూచించింది. ఈ నిర్మాణాలన్నీ మూడేళ్లలో పూర్తికావాలని గడువు కూడా విధించింది. బీఎస్‌ఓ నిబంధనలు దీనికి వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ భూమిని వేరొకరికి బదలాయించడం, లీజుకు ఇవ్వడం వంటి పనులు చేయకూడదు. కేటాయించిన భూమిలో పర్యావరణానికి సంబంధించిన నీటి వనరులు ఉంటే వాటికి విఘాతం కలగకుండా చూడాలని స్పష్టంచేసింది. ఏ అవసరాలకైతే భూమిని కేటాయించారో వాటికే ఉపయోగించాలని, వేరే అవసరాలకు వాడకూడదనే నిబంధన విధించింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే భూ కేటాయింపును రద్దు చేసి జిల్లా కలెక్టర్‌కు వెనక్కి తీసుకుంటారని హెచ్చరింది. ఆ భూమిలో ఇప్పటికే ఉన్న రహదారులు, రస్తాలు కొనసాగించాలని, వాటిని మూసేయడానికి వీల్లేదని పేర్కొంది.

భూమి ఎక్కడంటే...?

అన్నవరం గ్రామంలో పాత సర్వే నంబరు 101-1లోని ఎల్‌పీఎం నంబరు 1333లో 15.405 ఎకరాలు, నంబరు 1355లో 26 సెంట్లు, నంబరు 1333 లో 3.036 సెంట్లు కలిపి మొత్తం 18.7 ఎకరాలు కేటాయించింది. బీఎస్‌ఓ నిబంధనల ప్రకారం ఈ భూమిని ఉపయోగించుకోవడానికి స్థానిక అధికార యంత్రాంగం నిరంభ్యంతర ధ్రువపత్రం ఇస్తుందని వెల్లడించింది.

Updated Date - May 13 , 2025 | 01:09 AM