Share News

లోన్‌ యాప్‌లతో జాగ్రత్త

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:03 AM

సైబర్‌ మోసగాళ్ల ఖాతాల నుంచి రికవరీ చేసిన రూ.7.2 లక్షల నగదును నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి మంగళవారం ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్‌ బాధితులకు అందజేశారు.

లోన్‌ యాప్‌లతో జాగ్రత్త

పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి

సైబర్‌ నేరగాళ్ల ఖాతాల నుంచి రికవరీ చేసిన రూ.7.2 లక్షలు బాధితులకు పంపిణీ

విశాఖపట్నం, అక్టోబరు 87 (ఆంధ్రజ్యోతి):

సైబర్‌ మోసగాళ్ల ఖాతాల నుంచి రికవరీ చేసిన రూ.7.2 లక్షల నగదును నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి మంగళవారం ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్‌ బాధితులకు అందజేశారు. పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సైబర్‌ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు వేసే ఎత్తులో ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్‌ అనేది ఒకటన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు లోన్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని రుణాలు తీసుకుంటారన్నారు. రుణం తీసుకున్న తర్వాత సైబర్‌ నేరగాళ్లు తమ అసలు స్వరూపాన్ని చూపిస్తారన్నారు. రుణం తీసుకున్న వెంటనే తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతోపాటు పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా ఇంకా చెల్లించాల్సి ఉందంటూ వేధిస్తారన్నారు. ఎవరైనా ఇక చెల్లించబోమని చెప్పినా, వారి బాధ తట్టుకోలేక ఫోన్‌ను ఆపేసినా వారి ఫోన్‌లోని కాంటాక్ట్‌లకు బాధితుల న్యూడ్‌ ఫొటోలు, వీడియోలను ఎడిటింగ్‌ చేసి పంపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తారన్నారు. దీనిని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడితే, మరికొందరు ఎవరి వద్దనైనా అప్పులు చేసి సైబర్‌ నేరగాళ్లకు చెల్లింపులు జరుపుతూనే ఉంటారన్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించి నగరంలో ఇప్పటివరకూ 317 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌ నేరగాళ్ల ఖాతాల్లోని క్రిప్టో కరెన్సీని సీజ్‌ చేశామన్నారు. దీనిపై న్యాయపరమైన సంప్రతింపులు జరిపి, వివిధ ప్రక్రియలను పూర్తిచేసిన తర్వాత సీజ్‌ చేసిన క్రిప్టో కరెన్సీని ఇండియన్‌ కరెన్సీలోకి మార్చామన్నారు. మొదటి దశలో రూ.48,59,072ను వంద మంది బాధితులకు ఈ ఏడాది ఏప్రిల్‌లో అందజేశామన్నారు. రెండో దశలో భాగంగా 26 మందికి మంగళవారం రూ.7,20,647 అందజేస్తున్నామన్నారు. ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్‌ మోసాలకు సంబంధించిన కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని సీపీ కోరారు. ఎవరైనా సైబర్‌ మోసాలకుగానీ, ఇతర మోసాలకు గానీ గురైతే 7995095799 నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి తమకు జరిగిన మోసాన్ని వీలైనంత వేగంగా వివరించగలిగితే ఆ మొత్తాన్ని సైబర్‌ నేరగాళ్లకు చేరకుండా నిలుపుదల చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. బాధితులకు రికవరీ చేసిన మొత్తాన్ని సీపీ అందజేశారు. ఈ సమావేశంలో క్రైమ్‌ డీసీపీ కె.లతామాధురి, క్రైమ్‌ ఏడీసీపీ ఫల్గుణరావు, ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 01:03 AM