సర్పాలతో అప్రమత్తం
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:08 AM
వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయం ఇది. అన్నదాతలు రోజూ పొలానికి వెళుతుంటారు. వర్షాకాలంలో పాములు నివాసం వుండే ప్రదేశాలు ముంపునకు గురవడంతో అవి సురక్షితమైన ప్రదేశాలకు మకాం మారుస్తుంటాయి.
వర్షాకాలంలో అధిక బెడద
నాలుగు రకాల సర్పాలే అత్యంత విషపూర్తితమైనవి
పాముకాటు బాధితుల్లో ఎక్కువ మంది రైతులే
పాము కాటు వేస్తే.. సత్వరమే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లాలి
మూఢనమ్మకాలు, నాటువైద్యంతో ప్రాణాలకే ముప్పు
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఎస్‌వీ ఇంజక్షన్లు
చోడవరం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయం ఇది. అన్నదాతలు రోజూ పొలానికి వెళుతుంటారు. వర్షాకాలంలో పాములు నివాసం వుండే ప్రదేశాలు ముంపునకు గురవడంతో అవి సురక్షితమైన ప్రదేశాలకు మకాం మారుస్తుంటాయి. ఈ క్రమంలో రైతులకు విష సర్పాల ముప్పు పొంచి వుంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా ప్రాణాపాయం సంభవిస్తుంది. అయితే జిల్లాలో సంచరిస్తున్న పాముల్లో నాలుగు రకాలు మాత్రమే విషపూరితమైనవని కింగ్ కోబ్రా సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు మూర్తి కంటిమహంతి చెబుతున్నారు. పాములబారిన పడకుండా ఏయే జాగ్రత్తలు పాటించాలి? ఒకవేళ పాము కాటువేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడడానికి ఏం చేయాలి? వంటి వాటి గురించి ఆయన తెలిపిన సమాచారం..
పొలాల్లో పనిచేసే సమయంలో, కల్లాల వద్ద నిద్రలో ఉన్నప్పుడు, చీకట్లో పొలాలకు వెళ్లే సమయంలో రైతులు పాము కాటుకు గురవుతున్నారు. చాలామంది తమను పాము కాటే వేసిన విషయాన్ని కూడా గమనించలేని పరిస్థితి ఉంటుంది. కుట్టింది ఏ పాము అయినా, ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేయాలి.
నాలుగే విష సర్పాలు
మన పరిసరాల్లో సంచరించే పాముల్లో నాగు పాము, కట్ల పాము, పొడ పాము, రక్త పింజర మాత్రమే విష పూరితమైనవి. రక్త పింజర కాటు వేస్తే రక్త ప్రసరణ పడిపోతుంది. కాటు వేసిన సెకన్ల వ్యవధిలోనే శరీరంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. నాగు పాము విషం చాలా త్వరగా రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. తక్షణమే వైద్య సేవలు అందకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. నీటికొయ్యలు, జెర్రిగొడ్డు, పసిరికపాము, దుండు పాముల వల్ల వెంటనే అపాయం వుండదు. ఒకవేళ ఈ పాములు కుడితే ఏఎస్‌వీ ఇంజక్షన్‌లు తప్పక వేయించుకోవాలి. కాస్త ధైర్యంగా ఉండి గంట లోపల ఆస్పత్రికి చేరుకుని వైద్య సేవలు పొందాలి. లేకపోతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు ఇబ్బంది పడతారు.
పాము కాటేసిన విషయాన్ని ఎలా గుర్తించాలి..
గాఢ నిద్రలో ఉన్నప్పుడు, వేగంగా నడిచి వెళుతున్నప్పుడు, చీకిటి ప్రదేశాల్లో పాము కాటు వేసిన విషయాన్ని గమనించ లేకపోవచ్చు. పాము కాటేసిన నిమిషాల వ్యవధిలోనే మగత కమ్ముకుంటుంది. కాటు వేసిన ప్రదేశంలో పాము కోరల గాటు స్పష్టంగా కనిపిస్తుంది. నోటి నుంచి చొంగ, నురగ వస్తాయి. పాము కరిచిన చోట శరీరం తిమ్మిరిగా వుండి, భారంగా మారుతుంది. ఏదో కుట్టిందిలే అని అశ్రద్ధ చేస్తే గంటలోపు ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది.
పాము కాటుకు గురైతే...
పాము కాటుకు గురైన వారు మానసిక ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలి. లేకపోతే రక్తపోటు పెరిగిపోతుంది. రక్త ప్రసరణలో వేగం పెరిగి, పాము విషం త్వరగా గుండెకు, శరీరంలోని ఇతర అవయవాలను చేరుకుంటుంది. పాము కాటేసిన శరీర భాగాన్ని కిందకు ఉంచి, సత్వరమే వైద్యుడి వద్దకు తీసుకు వెళ్లాలి. పాము కరచే శరీర భాగాన్నిబట్టి విషప్రభావం తీవ్రత వుంటుంది. నడుము కిందభాగం, పాదాలు, కాళ్లపై కాటేస్తే ఆపైభాగంలో తాడుతో గట్టిగా కట్టి అర్ధగంటలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి. మెడ, ఛాతి, పొట్టభాగాల్లో కాటేస్తే నేరుగా విషం గుండెకు చేరే ప్రమాదం వుంది. బాధితులను చాలా త్వరగా ఆస్పత్రికి తరలించాలి. ఈలోగా 108 అంబులెన్స్‌కు సమాచారం ఇస్తే మంచిది. కాటు వేసిన పాము విషపూరితమైనదా? లేదా? అన్న విషయం రక్త పరీక్షల ద్వారా వైద్యులు నిర్ధారిస్తారు. రోగి శరీరం నుంచి తీసిన రక్తం 20 నిమిషాల్లో గడ్డకడితే కాటు వేసిన పాము విష పూరితమైనది కాదని భావించాలి. గడ్డకట్టకపోతే కాటు వేసిన పాము విషపూరితమైనదిగా భావించి అత్యవసర వైద్యం అందిస్తారు.
పాముకాటుకు గురికాకుండా ఉండాలంటే..
నివాస ప్రాంతాల్లో పుట్టలు, పొదలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొలం గట్లపై ముళ్లపొదలు, గడ్డి లేకుండా చూసుకోవాలి. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు, పైరుకు ఎరువులు/పురుగు మందులు వేసేటప్పుడు మోకాలి వరకు వుండే రబ్బరు బూట్లు ధరించాలి. పశుగ్రాసం కోసేటప్పుడు ముందుగా కొడవలితో అలికిడి చేయాలి. రాత్రిపూట పొలానికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా చేతికర్ర, టార్చ్ తీసుకెళ్లాలి. పొలంగట్లపై నడిచేటప్పుడు కర్రతో చప్పుడు చేయాలి.
మూఢనమ్మకంతో ప్రాణాలకే ముప్పు
వేపాకులో ఔషధ గుణాలు ఉన్నాయనే నమ్మకంతో పాము కాటుకు గురయిన వారి చేత వేపాకులు తినిపిస్తారు. ఇది పాము విషానికి విరుగుడుగా పని చేయదు. ఇంకొంత మంది పాము మంత్రగాళ్ల వద్దకు తీసుకు వెళతారు. విష పూరితమైన పాములు కాటేసినప్పుడు మంత్రాలు, తంత్రాలను నమ్ముకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం వుంది. అదే విధంగా నాటు వైద్యాన్ని ఆశ్రయించకూడదు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఎస్‌వీలు
డాక్టర్ సిరికి దినేశ్‌కుమార్, సూపరింటెండెంట్, చోడవరం సీహెచ్‌సీ
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు నివారణకు యాంటీ స్నేక్ వైల్ (ఏఎస్‌వీ) ఇంజక్షన్లు పీహెచ్‌సీలతోసహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అందుబాటులో వున్నాయి. పాము కాటుకు గురైన రైతులు, కూలీలు లేదా ఇతర వ్యక్తులు మూఢనమ్మకాలను పాటించకుండా వెంటనే ఆస్పత్రికి వస్తే ప్రాణాపాయం తప్పుతుంది.