వర్షాకాలంలో ఇసుక సేకరణపై నిషేధం
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:39 AM
వర్షాకాలంలో ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక సేకరణను నిషేధిస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ప్రకటించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
పాడేరు, జూన్ 9(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక సేకరణను నిషేధిస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ప్రకటించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 1 నుంచి అక్టోబరు 15 వరకు రుతుపవనకాలంలో గోదావరి ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను సేకరించడాన్ని నిలుపుదల చేస్తున్నామన్నారు. అలాగే స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానికంగా ఉన్న జలపాతాలు, వాగులు, గెడ్డల నుంచి ఇసుక సేకరించ వచ్చన్నారు. చింతూరు మండల పరిధిలోని గుండాల ఇసుక నిల్వ కేంద్రం వద్ద 1.19 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. అలాగే జిల్లాకు సమీపంలోని వి.మాడుగుల, చోడవరం, కొత్తవలస, బొబ్బిలి, నర్సీపట్నం వద్ద ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా చోట్ల వినియోగ దారులు ఇసుకను కొనుగోలు చేసుకోవచ్చునన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, గనుల శాఖ ఏడీ ఎం.ఆనంద్, భూగర్భ జలాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.మురళీధర్, ఎస్‌ఎంఐ డీఈఈ ఆర్ .నాగేశ్వరరావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈఈ ఎన్.నీలిమ, తదితరులు పాల్గొన్నారు.