బంతి పూల విక్రయాల జోరు
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:28 PM
మన్యంలో బంతి పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయు. జిల్లా కేంద్రం పాడేరులోని పాతబస్టాండ్ ఆవరణలో గిరిజన రైతుల వద్ద వర్తకులు వాటిని కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం బుట్ట పూలు రూ.200
దీపావళి, కార్తీక మాసం సమీపిస్తుండడంతో ధర పెరిగే అవకాశం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో బంతి పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయు. జిల్లా కేంద్రం పాడేరులోని పాతబస్టాండ్ ఆవరణలో గిరిజన రైతుల వద్ద వర్తకులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సీజన్ ప్రారంభం కావడంతో బుట్ట పూలు రూ.200 వరకు విక్రయిస్తున్నారు. దీపావళి, కార్తీకమాసంలో వీటి ధర మరింత పెరుగుతుందని రైతులు అంటున్నారు.
పాడేరు మండలంతో పాటు ఆనుకుని ఉన్న హుకుంపేట, జి.మాడుగుల మండలాలకు చెందిన గిరిజన రైతులు ప్రతి ఏడాది బంతి పూలను సాగు చేస్తుంటారు. అక్టోబరు రెండో వారం నుంచి దాదాపుగా డిసెంబరు మొదటి వారం వరకు పాడేరులో బంతి పూల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అలాగే సీజన్ ప్రారంభంలో పది కిలోలుండే బుట్ట పూలు రూ.150 నుంచి రూ.200కు వర్తకులు కొనుగోలు చేస్తుంటారు. అయితే పండుగ సీజన్‌లో రెట్టింపు కావడం, సీజన్ ముగిసే నాటికి అదే బుట్ట పూలు రూ.50 నుంచి రూ.100కు ధర దిగజారడం సర్వసాధారణం. అనకాపల్లి, నర్సీపట్నం, తుని, కాకినాడ ప్రాంతాలకు చెందిన వర్తకులు వచ్చి గిరిజన రైతుల వద్ద బంతి పూలు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వర్తకులు వస్తే ధర రెండింతలు పెరుగుతుందని రైతులు అంటున్నారు.
బంతి పూలకు భలే డిమాండ్
ఏజెన్సీలో సహజసిద్ధంగా సాగు చేసే బంతి పూలకు ఇతర ప్రాంతాల్లో చాలా ఢిమాండ్ ఉంది. ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో పూలు కోసిన రెండు, మూడు రోజుల్లో వాడిపోతాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని కొనుగోలు చేసిన పూలను ఇతర ప్రాంతాల్లోని మార్కెట్‌లకు సకాలంలో రవాణా చేయకపోతే వర్తకులు నష్టపోయే ప్రమాదముంది. అదే ఏజెన్సీలోని పూలు అయితే కోసిన వారం రోజులకు గాని వాడిపోవు. అందు వలన ఇక్కడ కొనుగోలు చేసిన పూలను ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చుననే ఽధీమాతో వర్తకులు వాటిని కొనుగోలుకు ఎగబడుతుంటారు.