ఘనంగా మాడగడలో బలి ఉత్సవం
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:35 PM
మండలంలోని మాడగడలో బలి ఉత్సవం పదకొండవ రోజైన గురువారం వేడుకను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. బలి దేవాలయంలో రాత్రి ఇద్దరు మహిళా పూజారులు ప్రత్యేక పూజలు చేశారు.
ముళ్ల పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు
అధిక సంఖ్యలో పాల్గొన్న గిరిజనం
అరకులోయ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాడగడలో బలి ఉత్సవం పదకొండవ రోజైన గురువారం వేడుకను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. బలి దేవాలయంలో రాత్రి ఇద్దరు మహిళా పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే పూజారిపై బలి దేవుడు ఆవహించడంతో నాట్యం చేశారు. ముళ్ల పీటలను గర్భగుడి నుంచి తీసుకురాగా మహిళా పూజారులు దానిపై కూర్చొని పూజలు చేశారు. 30 మంది భీమ్ బోయ్‌లతో మగ పూజారి పూజలు చేయించి గర్భగుడిలోకి తీసుకువెళ్లారు. గురు భీమ్ బోయ్, మరో భీమ్ బోయ్‌కి ముళ్ల జంధ్యాన్ని వేయగా, పూనకంతో ఊగిపోతూ భక్తుల మధ్య నాట్యం చేశాడు. ఈ భీమ్ బోయ్‌లు ఏ ఊరు వెళ్లి ఎవరి తోటలో ఏం కావాలన్నా తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్లకు ఎవరూ ఎదురు చెప్పరు. వీరు ఎవరి పొలంలో, తోటలో కాలు పెడితే వారి పంటలు బాగా పండుతాయని గిరిజనుల విశ్వాసం. ఉత్సవం ఆఖరి రోజైన శుక్రవారం బలి పుష్పాలను పొలాల్లో విడిచి పెట్టడంతో వేడుకకు ముగింపు పలికినట్టు అవుతుంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన రద్దు
మండలంలోని మాడగడలో జరుగుతున్న బలి ఉత్సవం ఆఖరి రోజు కార్యక్రమానికి ఈ నెల 5న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకావలసి ఉండగా, అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయింది. గిరిజనుల ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్ రావడానికి సుముఖత చూపడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన రావడం లేదని తెలిసింది. కాగా గిరిజనులే త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి బలి పుష్పాలను అందజేస్తారని సమాచారం.