ఏయూలో బ్యాక్‌లాగ్!
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:46 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీచేసి న వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్సీ, ఎస్టీ పోస్టుల భర్తీపై ఆరోపణల వెల్లువ
గుట్టుగా ప్రక్రియను పూర్తిచేయడంతో తీవ్రస్థాయిలో విమర్శలు
సెలవురోజు అభ్యర్థులకు నేరుగా నియామక పత్రాలు
ఇప్పటికీ వెబ్‌సైట్‌లో కనిపించని వివరాలు
కోర్టును ఆశ్రయించే యోచనలో అభ్యర్థులు
విశాఖపట్నం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీచేసి న వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ప్రక్రియను చేపట్టి, అనర్హులకు లబ్ధి చేకూర్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో దరఖాస్తు చేసిన వారిలో కొందరు కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..
ఏయూలో బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీచేయడం కొన్నేళ్లుగా సమస్యగా మారింది. ఇందుకోసం 2018లోనే నోటిఫికేషన్ ఇచ్చారు. కొన్ని కారణాలతో ప్రక్రియ ముందుకు సాగలేదు. మళ్లీ 2021లో 33 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి భారీ స్పందన వచ్చింది. సుమారు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. మెస్‌వర్కర్లు, తోటపని, హాస్టల్ సహాయ కుల పోస్టులకు కూడా ఎంబీఏ, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయా పోస్టులకు ఏడు, పదో తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలని, ఇం టర్వ్యూలు లేకుండా మెరిట్ ప్రకారం పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు ప్రకటించారు. దరఖాస్తు చేసిన కొందరు అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతలపై ఫిర్యా దులు, ప్రక్రియపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడం, న్యాయపరమైన చిక్కులతో ప్రక్రియ నిలిచిపోయింది.
కొద్దిరోజుల కిందట ఈ ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. 33 బ్యాక్‌లాగ్ పోస్టులకు 28 పోస్టులను గుట్టుగా భర్తీ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియామక ప్రక్రియ సాగిన తీరు అధికారులకూ తెలియదని చెబుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చారా లేక, గత నోటిఫికేషన్ మేరకు చర్యలు తీసుకున్నారా అనేది అంతుపట్టని ప్రశ్నగా మారింది. అదే సమయంలో మెరిట్ జాబితాను అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపర్చలేదు. సాధారణంగా వర్సిటీలో ఎటువంటి నియామకాలు చేపట్టినా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కానీ ఈ పోస్టుల విషయంలో ఆ పద్ధతి పాటించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వుల ను కూడా వ్యక్తిగతంగా అందించారు. అంతేకాకుండా నగరంలోని ఒకే ప్రాంతానికి చెందిన నలుగురికి బ్యాక్‌లాగ్ పోస్టుల్లో ఉద్యోగాలు వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో ఉన్నతస్థాయి ఒత్తిళ్ల మేరకు ప్రక్రియను చేపట్టి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులే ప్రకటించాలి..
నిబంధనలకు అనుగుణంగా నియామక ప్రక్రియను చేపడితే అధికారులు వెల్లడించాలని పలువురు కోరుతు న్నారు. ఈ వ్యవహారంపై కొందరు కోర్టును ఆశ్రయించేం దుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికైనా ఏయూ ఉన్నతాధికారులు నియామక ప్రక్రియపై ప్రకటన విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.