Share News

నవజాత శిశువులకు మళ్లీ బేబీ కిట్లు

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:19 PM

నవజాత శిశువులకు ఎన్‌టీఆర్‌ బేబీ కిట్లు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఆరేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరిస్తూ జీవో నంబరు 61 విడుదల చేసింది.

నవజాత శిశువులకు మళ్లీ బేబీ కిట్లు
ఎన్‌టీఆర్‌ బేబీ కిట్‌ (ఫైల్‌)

ఆరేళ్ల తర్వాత పథకం పునరుద్ధరణ

వచ్చే నెల నుంచి అమలు

ఆస్పత్రిలో ప్రసవం పొందిన తల్లులకు పంపిణీ

కిట్‌లో రూ.1,410 విలువైన సామగ్రి

చింతపల్లి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి):

నవజాత శిశువులకు ఎన్‌టీఆర్‌ బేబీ కిట్లు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఆరేళ్ల తరువాత కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరిస్తూ జీవో నంబరు 61 విడుదల చేసింది. ఇందుకోసం రూ.51.14 కోట్లను కేటాయించింది.ఆస్పత్రిలో ప్రసవం పొందిన నవజాత శిశువుల సంరక్షణకు రూ.1,410 విలువైన సామగ్రిని కిట్‌ ద్వారా అందజేయనున్నారు. ఈ కిట్లు వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన నవజాతి శిశువుల సంరక్షణకు ఎన్టీఆర్‌ బేబీ కిట్లను వచ్చే నెలల నుంచి పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి బేబీ కిట్లు తీసుకొచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. వచ్చే నెల నుంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమికోన్నత, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో నాణ్యమైన బేబీ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. గర్భిణీ ప్రసవం పొందిన వెంటనే వైద్యులు కిట్లు పంపిణీ చేసేందుకు అనువుగా అవసరమైన నిల్వలు ఆస్పత్రిలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

శిశువుల సంరక్షణకు బేబీ కిట్లు

నవజాత శిశువును ఏడాది వయస్సు వచ్చే వరకు ప్రత్యేక శ్రద్ధతో సంరక్షించాలి. శిశువులకు ధరించే దుస్తులు, టవల్స్‌, ఆయిల్‌, సబ్బు, షాంపూ ప్రత్యేకంగా ఉండాలి. దీని వల్ల వ్యాధులకు దూరంగా ఉండడంతోపాటు శిశు మరణాలు నియంత్రించవచ్చు. శిశువుల సంరక్షణకు ఉపయోగించే బేబీ కిట్లు మార్కెట్‌లో రూ.1,500 నుంచి రూ.1,800 ధరకు లభిస్తున్నాయి. అయితే గిరిజనులు, నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లులు బేబీ కిట్లు కొనుగోలు చేసుకునే ఆర్థిక పరిస్థితి లేదు. దీంతో గిరిజన ప్రాంతంలో శిశువుల సంరక్షణకు పాత గుడ్డలను ఉపయోగిస్తుంటారు. దీంతో శిశువుల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన నాటి టీడీపీ ప్రభుత్వం 2016లో ఎన్‌టీఆర్‌ బేబీ కిట్లు పంపిణీని ప్రారంభించింది. ఆస్పత్రిలో ప్రసవం పొందిన ప్రతీ తల్లికి బేబీ కిట్‌ అందజేసేవారు. దీంతో తల్లులు బేబీ కిట్లు కొనుగోలు చేసే ఆర్థిక భారం తగ్గింది.

పథకం రద్దుచేసిన వైసీపీ ప్రభుత్వం

2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ బేబీ కిట్లు పంపిణీ పథకాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం పొందిన తల్లులకు కిట్లు పంపిణీని నిలిపివేసింది. దీంతో తల్లులు బేబీ కిట్లు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన ప్రాంతంలో శీతాకాలం చలి వణికిస్తుంది. ఈసమయంలో శిశువుల సంరక్షణకు కచ్చితంగా బీబీ కిట్లు ఉండాలి. గిరిజనులందరూ బేబీ కిట్లు కొనుగోలు చేసుకునే ఆర్థిక పరిస్థితి లేదు. దీంతో గత ఆరేళ్లగా తల్లులు శిశువులను సంరక్షించేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

బేబీ కిట్లులో 11 రకాల వస్తువులు

నవజాత శిశువులకు పంపిణీ చేసే ఎన్‌టీఆర్‌ కిట్‌లో 11 రకాల వస్తువులను ప్రభుత్వం అందజేయనున్నది. ప్రధానంగా దోమల తెర కలిగిన బేబీ బెడ్‌, బేబీ మాంకితోష్‌, బేబీ డ్రస్‌, టవల్‌, నేపీ, జాన్‌సన్‌ 200 గ్రాముల పౌడర్‌, 100మిల్లీ లీటర్ల షాంపూ, 200 మిల్లీలీటర్ల ఆయిల్‌, బేబీ సబ్బు, సబ్బు బాక్స్‌, రేటెల్‌ బొమ్మను అందజేయనున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:19 PM