Share News

వ్యాక్సిన్‌ వికటించి శిశువు మృతి

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:34 PM

నెలల వారీ శిశువులకు వేసే వ్యాక్సిన్‌ వికటించి పసికందు మృతి చెందిందని తల్లిదండ్రులు చెబుతుండగా.. పసరు మందు పట్టించడమే కారణమని వైద్యులు అంటున్నారు. ఈ ఘటన మండలంలోని కుజభంగి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

వ్యాక్సిన్‌ వికటించి శిశువు మృతి
మృతి చెందిన శిశువు

కుటుంబ సభ్యుల ఆరోపణ

వాక్సిన్‌ కాదు.. పసర మందు వల్లేనని

వైద్యాధికారి రాంబాబు స్పష్టీకరణ

డుంబ్రిగుడ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని కుజభంగి గ్రామంలో అగతంబిడి లావణ్య, ప్రవీణ్‌ దంపతులకు రెండు నెలల శిశువు ఉంది. ఈనెల 24న ఆ గ్రామంలో శిశువులకు వ్యాక్సిన్లు వైద్య సిబ్బంది వేశారు ఇందులో భాగంగా ఆ పసికందుకు కూడా వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌ వేసినప్పటి నుంచి శిశువుకు జ్వరం వచ్చింది. శుక్రవారం తెల్లవారు జామున పసికందు ఊపిరాడక మృతి చెందిందని బాధిత కుటుంబీకులు తెలిపారు. అయితే ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారి రాంబాబు వద్ద ప్రస్తావించగా.. వ్యాక్సిన్‌ వేసిన శిశువుకు పసరు మందు పట్టించడంతో మరణించినట్టు నిర్ధారించారు. కుజభంగిలో ఈనెల 24వ తేదీన వ్యాక్సిన్లు వేయడం వాస్తవమేనన్నారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత శిశువులకు సాధారణ జ్వరం వస్తుందని అందరికీ తెలిసిందేనన్నారు. పుట్టుకతోనే ఆ శిశువుకు మూర్చ లక్షణాలు ఉన్నాయని, జ్వరంతో కూడిన మూర్చ వచ్చిందన్నారు. మూర్చ ఉన్నట్టు తెలియక ఆ కుటుంబీకులు పసర మందును పట్టించడంతో పరిస్థితి వికటించి శిశువు మృతి చెందినట్టు వైద్యాధికారి రాంబాబు నిర్ధారించారు.

Updated Date - Sep 26 , 2025 | 10:34 PM