Share News

బాబోయ్‌ బీఎన్‌ రోడ్డు!

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:38 AM

చోడవరం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధాన రహదారుల్లో ఒకటైన భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డు చోడవరం నియోజకవర్గం పరిధిలో అత్యంత దారుణంగా తయారైంది.

బాబోయ్‌ బీఎన్‌ రోడ్డు!

  • అడుగడుగునా గోతులతో జనం బెంబేలు

  • ప్రమాదకరంగా తయారైన ప్రయాణం

  • పాడైపోతున్న వాహనాలు

  • గత ప్రభుత్వ పాలకుల నిర్వాకంతో జనం పాట్లు

  • ఏడాది దాటినా స్పందించని కూటమి ప్రభుత్వం

చోడవరం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ప్రధాన రహదారుల్లో ఒకటైన భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డు చోడవరం నియోజకవర్గం పరిధిలో అత్యంత దారుణంగా తయారైంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగించే ఈ రోడ్డు నిర్వహణ, అభివృద్ధి విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల పరిధిలో పలుచోట్ల రహదారి మొత్తం ఛిద్రమై, భారీ గోతులు ఏర్పడిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం ఎన్‌డీబీ నిధులతో అభివృద్ధి, విస్తరణ పనుల కోసం అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అందరికన్నా తక్కువ రేటుకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా విస్తరణ పనులు, కొన్నిచోట్ల కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టారు. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే పనులు పూర్తయిన తరువాత బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం మొబిలైజేషన్‌ నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఏడాది ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. మరోవైపు నిర్వహణ పనులు (రోడ్డుపై ఏర్పడిన గోతులు పూడ్చడం, ఇరువైపులా తుప్పలు నరకడం) చేపట్టకపోవడంతో రహదారిపై ఏటేటా గోతులు మరింత అధికం అయ్యాయి. వర్షం కురిసినప్పుడు నీరు నిలిచిపోయి, వాహనాల రాకపోకలతో మరింత పెద్దవిగా తయారవుతున్నాయి. పలుచోట్ల రోడ్డు మొత్తం ధ్వంసమై, వర్షం నీటితో పంట కుంటలను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణ సమయం రెట్టింపు అవుతుండడంతోపాటు వాహనాలు పాడైపోతున్నాయని వాపోతున్నారు. జిల్లాలో ఇతర రహదారులను అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం.. బీఎన్‌ రోడ్డు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని నియోజకవర్గం ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. రోడ్డు అభివృద్ధి అటుంచి.. కనీసం గుంతలు అయినా పటిష్ఠంగా పూడ్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 01:38 AM