Share News

కాఫీ రైతులకు పురస్కారాలు

ABN , Publish Date - Dec 20 , 2025 | 10:23 PM

అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన రైతులకు కేంద్ర కాఫీ బోర్డు ఉత్తమ పురస్కారాలను అందజేసింది.

కాఫీ రైతులకు పురస్కారాలు
కర్ణాటక చిక్‌మంగుళూర్‌ సీసీఆర్‌ఐ శతాబ్ది ఉత్సవాల్లో ఉత్తమ రైతులను సత్కరిస్తున్న కేంద్ర కాఫీ బోర్డు సీఈవో కూర్మారావు, చైర్మన్‌ ఎంజే దినేశ్‌, డీఆర్‌ డాక్టర్‌ సింతిల్‌ కుమార్‌

చిక్‌మంగుళూరులో కేంద్ర కాఫీ పరిశోధన సంస్థ శతాబ్ది ఉత్సవాలు

అల్లూరి జిల్లాకు చెందిన నలుగురు రైతులకు సత్కారం

ఉత్సవాలకు హాజరైన ఐటీడీఏ పీవో శ్రీపూజ

పాడేరు/చింతపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన రైతులకు కేంద్ర కాఫీ బోర్డు ఉత్తమ పురస్కారాలను అందజేసింది. శనివారం కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌మంగులూరు కేంద్ర కాఫీ పరిశోధన సంస్థ(సీసీఆర్‌ఐ) శతాబ్ది ఉత్సవాల్లో జిల్లాలకు చెందిన నలుగురు రైతులకు కేంద్ర కాఫీ బోర్డు సీఈవో ఎం. కూర్మారావు, చైర్మన్‌ ఎంజే దినేశ్‌, పరిశోధన సంచాలకులు డాక్టర్‌ సింతిల్‌ కుమార్‌ పురస్కారాలు అందజేసి సత్కరించారు. అరకులోయ సుంకరిమెట్టకు చెందిన కొర్ర సావిత్రి, చింతపల్లి మండలం గొందిపాకలుకు చెందిన బౌడు కుశలవుడు, డుంబ్రిగుడ తాంగుల జిన్ను, హుకుంపేట వరుబోయిని బొంజుబాబు ఉత్తమ పురస్కారాలను అందుకున్నారు.

శతాబ్ది ఉత్సవాల్లో ఐటీడీఏ పీవో శ్రీపూజ

కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగుళూరులో శనివారం నిర్వహించిన కేంద్ర కాఫీ పరిశోధనా సంస్థ శతాబ్ది ఉత్సవాల్లో పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆధ్వర్యంలో ఒక బృందం పాల్గొంది. అక్కడ కాఫీకి సంబంధించి పలు అంశాలను బృందం పరిశీలించింది. వాటిని గిరిజన కాఫీ రైతులకు అలవాటు చేయాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కాఫీ బోర్డు డీడీ మురళీధర్‌, సీనియర్‌ లైజన్‌ అధికారి ఎస్‌.రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 10:23 PM