తల్లికి వందనం కోసం ఎదురుచూపు
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:03 AM
జిల్లాలో ఇంకా ఎనిమిది వేల మందికిపైగా తల్లికి వందనం సాయం అందలేదు.
జిల్లాలో సాయం అందనివారు 8,000 మంది వరకూ ఉంటారని అంచనా
ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు అనుసంధానం కాకపోవడం, విద్యుత్ బిల్లు అధికంగా రావడం వంటి కారణాలతో విడుదల కాని సొమ్ములు
వచ్చే నెలలో జమకు అవకాశం
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఇంకా ఎనిమిది వేల మందికిపైగా తల్లికి వందనం సాయం అందలేదు. పలు కారణాలతో విద్యార్థుల తల్లుల ఖాతాలకు సొమ్ములు జమ కాలేదు. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ బిల్లులు రావడం, ఐటీ రిటర్న్స్ సమర్పించడం, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు అనుసంధానం కాకపోవడం, ఉచిత విద్యా పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు పొందిన విద్యార్థుల అన్న/తమ్ముడు/అక్క, చెల్లికి సొమ్ములు అందలేదు. వారంతా విద్యా శాఖ కార్యాలయంతోపాటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.
కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఈ ఏడాది జూన్ 13న జిల్లాలో 1,90,433 మంది విద్యార్థులకు సంబంధించి 1,30,706 మంది తల్లుల ఖాతాలకు సొమ్ములు జమ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు కూడా ఈనెల నుంచి సొమ్ములు విడుదల చేస్తారు. అయితే అన్ని రకాల అర్హతలున్న విద్యార్థులు సుమారు ఎనిమిది వేల మందికి సొమ్ములు జమ కాలేదని అధికారులు గుర్తించారు. అటువంటి వారంతా అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పుడు ఆన్‌లైన్‌లో స్టేటస్ పరిశీలిస్తే పలు కారణాలు ఉన్నట్టు వెల్లడైంది. నగరంలో చాలాచోట్ల ఒక యజమానికి చెందిన ఇళ్లల్లో పలువురు అద్దెకు ఉంటుంటారు. అటువంటిచోట్ల అన్ని కుటుంబాలకు కలిపి ఒకే విద్యుత్ మీటరు ఉండడంతో నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి వస్తోంది. ఇది ఆయా కుటుంబాలకు చెందిన పిల్లల తల్లుల ఖాతాలకు సొమ్ములు జమ చేయడానికి అడ్డంకిగా మారింది. ఇటువంటి కుటుంబాలు వేర్వేరుగా విద్యుత్ మీటర్లు ఏర్పాటుచేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీనిపై పాఠశాల విద్యా శాఖకు నివేదించన్నారు. ఉచిత విద్య కింద సీట్లు పొందిన విద్యార్థి తోబుట్టువులకు పథకం రాని విషయంలో ఇబ్బంది లేదని, దీనిపై ఆయా పాఠశాలను తనిఖీ చేసి నివేదిక తీసుకుని ప్రభుత్వానికి పంపపుతామని చెబుతున్నారు. ఇదిలావుండగా ఆదాయపన్ను శాఖకు రిటర్న్స్ దాఖలు చేసిన కుటుంబాలకు తల్లికి వందనం సొమ్ములు జమ కావడం అనుమానమేనని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ పలు కారణాలతో తల్లికి వందనం సొమ్ములు జమకాని తల్లులు విషయంలో అడ్డంకులు తొలగించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నామని విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఇటువంటి వారికి వచ్చే నెలలో సొమ్ములు జమ అవుతాయని వివరించారు.