Share News

పైలా అవినాష్‌....రూ.11.5 లక్షలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:22 AM

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌-4 టోర్నీకి సంబంధించి సోమవారం నిర్వహించిన వేలంలో ఐకాన్‌ ఆటగాళ్లు మంచి ధర పలికారు.

పైలా అవినాష్‌....రూ.11.5 లక్షలు

  • రిక్కీ బుయ్‌ రూ.10.26 లక్షలు, గిరినాథ్‌రెడ్డి రూ.10.2 లక్షలు

  • శ్రీకర్‌ భరత్‌, నితీష్‌కుమార్‌రెడ్డి, హనుమ విహారి, అశ్విన్‌ హెబ్బర్‌కు రూ.పదేసి లక్షలు

  • రసవత్తరంగా ఏపీఎల్‌ సీజన్‌-4 ఆటగాళ్ల వేలం

విశాఖపట్నం, స్పోర్ట్సు, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌-4 టోర్నీకి సంబంధించి సోమవారం నిర్వహించిన వేలంలో ఐకాన్‌ ఆటగాళ్లు మంచి ధర పలికారు. నగరానికి చెందిన పైలా అవినాష్‌ అత్యధికంగా రూ.11.5 లక్షలకు అమ్ముడుపోగా, తర్వాత స్థానంలో రికీ బుయ్‌ (రూ.10.26 లక్షలు) ఉన్నారు. ఇక టాప్‌ సీడ్‌ ఆటగాళ్లలో గిరినాథ్‌రెడ్డి రూ.10.2 లక్షలకు, టీమిండియా ఆటగాళ్లు నితీష్‌కుమార్‌రెడ్డి, శ్రీకర్‌ భరత్‌, హనుమ విహారితోపాటు ఇతర ఆటగాళ్లు తలో రూ.10 లక్షలకు అమ్ముడయ్యారు. నాలుగు కేటగిరీల నుంచి 520 మంది ఆటగాళ్లను వేలంలో ఉంచారు. జట్టు సభ్యుల కొనుగోలు కు రూ.45 లక్షలు కేటాయించేలా ఫ్రాంచైజర్‌కు పరిమితి విధించారు. టీమిండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారితోపాటు ఐపీఎల్‌ ఆడిన తొమ్మిది మంది ఆటగాళ్లను టాప్‌ సీడ్‌లో, గ్రేడ్‌-ఏలో 21 మందిని, గ్రేడ్‌-‘బి’లో 112 మందిని, గ్రేడ్‌-‘సి’లో 378 ఆటగాళ్లను వేలంలో ఉంచారు. ఆల్‌రౌండర్స్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ, భీమవరం బుల్స్‌, సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌, తుంగభద్ర వారియర్స్‌, విజయవాడ సన్‌షైనర్స్‌, కాకినాడ కింగ్స్‌, అమరావతి రాయల్స్‌ జట్లకు చెందిన ఫ్రాంచైజర్లు వేలంలో పాల్గొన్నారు. వేలానికి ముందు టాప్‌ సీడ్‌లో ఉన్న తొమ్మిది మంది ఆటగాళ్లలో ఎనిమిది మందిని ఏడు జట్లు సొంతం (రిటైన్‌) చేసుకున్నాయి. రిటైన్‌ చేసుకున్న వారిలో హనుమ విహారి (రూ.10 లక్షలు, అమరావతి రాయల్స్‌), అశ్విన్‌ హెబ్బర్‌ (రూ.10 లక్షలు, విజయవాడ సన్‌షైనర్స్‌), రషీద్‌ (రూ.10 లక్షలు, తుంగభద్ర వారియర్స్‌), కేవీ శశికాంత్‌ (రూ.5 లక్షలు, తుంగభద్ర వారియర్స్‌), రికీ బుయ్‌ (రూ.10.26 లక్షలు, సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌), శ్రీకర్‌ భరత్‌ (రూ.10 లక్షలు, కాకినాడ కింగ్స్‌), కె.నితీష్‌కుమార్‌రెడ్డి (రూ.10 లక్షలు, భీమవరం బుల్స్‌) ఉన్నారు.

పైలా అవినాష్‌....రూ.11.5 లక్షలు

గ్రేడ్‌-ఏలోని 21 మంది ఆటగాళ్లలో ఒకడైన నగర క్రికెటర్‌ పైలా అవినాష్‌ను రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ జట్టు ఫ్రాంచైజర్లు రూ.11.5 లక్షలకు కొనుగోలు చేశారు. ఏపీఎల్‌ సీజన్‌-4లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా అవినాష్‌ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత స్థానంలో ఉన్న రిక్కీ బుయ్‌ (రూ.10.26 లక్షలు)తోపాటు రూ.10 లక్షలకు రిటైన్‌ చేసుకున్న నితీష్‌కుమార్‌రెడ్డి, శ్రీకర్‌ భరత్‌ కూడా విశాఖకు చెందినవారు కావడం గమనించదగ్గ విషయం.

Updated Date - Jul 15 , 2025 | 01:22 AM