Share News

పిన్న వయసులోనే అవాస్కులర్‌ నెక్రోసిస్‌

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:19 AM

గత కొన్నాళ్లుగా అవాస్కులర్‌ నెక్రోసిస్‌ (ఏవీఎన్‌)/ఆస్టియో నెక్రోసిస్‌ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.

పిన్న వయసులోనే అవాస్కులర్‌ నెక్రోసిస్‌

  • కొవిడ్‌ తరువాత గణనీయంగా పెరిగిన బాధితులు

  • కేజీహెచ్‌కు గతంలో నెలకు ఒకటి, రెండు కేసులు

  • ఇప్పుడు రోజుకు రెండు...

  • ఎముకకు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో సమస్య ఉత్పన్నం

  • స్టెరాయిడ్స్‌ వినియోగం కొంత కారణం

  • ప్రాథమిక దశలో గుర్తించడం కీలకమంటున్న వైద్య నిపుణులు

విశాఖపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి):

గత కొన్నాళ్లుగా అవాస్కులర్‌ నెక్రోసిస్‌ (ఏవీఎన్‌)/ఆస్టియో నెక్రోసిస్‌ బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఎముకకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు. కేజీహెచ్‌లోని ఆర్థో విభాగం ఓపీకి కరోనాకు ముందు నెలకు ఒకటి, రెండు కేసులు వస్తే, ప్రస్తుతం రోజుకు ఒకటి నుంచి రెండు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య కొన్ని రెట్లు పెరిగినట్టు వైద్యులు పేర్కొంటున్నారు.

ఏవీఎన్‌ అంటే ఏమిటి.?

ఎముకకు రక్త ప్రసరణ నిలిచిపోవడాన్ని అవాస్కులర్‌ నెక్రోసిస్‌ (ఏవీఎన్‌) అంటారు. శరీరంలో ఎక్కడైనా ఎముకకు రక్త ప్రసరణ నిలిచిపోతే ఆ భాగం ఏవీఎన్‌ బారినపడుతుందంటున్నారు. ఎక్కువగా తుంటి ఎముక, యాంకిల్‌ జాయింట్‌, రిస్ట్‌ భాగాల్లో సమస్య వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ తరువాత రక్తనాళాల్లో మార్పులు, అధికంగా స్టెరాయిడ్స్‌ వినియోగం వంటివి ఈ సమస్యకు కారణమవుతున్నట్టు పేర్కొంటున్నారు. కొన్ని కారణాల వల్ల రక్త ప్రసరణ తగ్గిపోయి ఎముక కణజాలం చనిపోతుంది. రక్త ప్రసరణ ఉన్న సమయంలో గట్టిగా ఉండే ఎముక కణజాలం బోన్‌ డెడ్‌ అయిన తరువాత సాఫ్ట్‌గా మారిపోతుంది. దీనివల్ల శరీర బరువు తట్టుకోలేక ఆకృతి మారిపోతుంది. తత్ఫలితంగా తీవ్రమైన నొప్పి, మూవ్‌మెంట్‌ తగ్గిపోవడం, కుంటడం వంటి లక్షణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా సమయంలో వినియోగించిన స్టెరాయిడ్స్‌, ఇతర కారణాల వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే తీరు పెరగడం వంటివి ఈ సమస్య తీవ్రత పెరగడానికి కారణమవుతున్నట్టు చెబుతున్నారు. ఆస్తమా, రుమటైడ్‌ ఆర్థరైటిస్‌ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మందులు వినియోగించిన వారిలోనే ఈ సమస్య కనిపిస్తున్నట్టు చెబుతున్నారు.

ఈ వయసు వారిలో ఎక్కువ..

గతంలో 50 ఏళ్లు దాటినవారు ఈ సమస్య బారినపడేవారు. ప్రస్తుతం యుక్త వయస్కులు అధికంగా కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రతి పది కేసుల్లో ఆరు నుంచి ఏడు కేసులు 20 నుంచి 40 ఏళ్ల మధ్యవయస్కులు ఉంటున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

అధిక సంఖ్యలో వస్తున్న కేసులు

- డాక్టర్‌ ఎం.చంద్రశేఖరంనాయుడు, ఆర్థో విభాగాధిపతి, కేజీహెచ్‌

ఏవీఎన్‌తో బాధపడుతూ ఆస్పత్రికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు నెలకు ఒకటి, రెండు వస్తుండేవి. ఇప్పుడు ప్రతిరోజూ ఓపీలో ఒకటి, రెండు కేసులు చూస్తున్నాం. ఈ సమస్యను ప్రాథమిక దశలో గుర్తించి వైద్యం తీసుకోవడం కీలకం. సమస్య గ్రేడ్‌ 1, 2లో ఉన్నప్పుడు వస్తే వారికి కోర్‌ డీ కంప్రెషన్‌, బోన్‌ మ్యారో యాస్పిరేషన్‌ కాన్సంట్రేషన్‌ అనే సర్జరీలు నిర్వహిస్తాం. బోన్‌ మ్యారో యాస్పిరేషన్‌ కాన్సంట్రేషన్‌ సర్జరీ బయట చేయించుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. కేజీహెచ్‌లో ఉచితంగా నిర్వహిస్తున్నాం. గ్రేడ్‌ 3, 4లో వచ్చిన వారికి తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి. వారికి పరిస్థితిని బట్టి వైద్య సేవలు అందిస్తాం. శస్త్ర చికిత్సలు, వైద్య పద్ధతుల ద్వారా నిలిచిపోయిన రక్త ప్రసరణను మళ్లీ సరిచేసి కోలుకునేలా చేస్తాం.

Updated Date - Sep 07 , 2025 | 01:19 AM