Share News

ఆటో డ్రైవర్‌ హత్య

ABN , Publish Date - Sep 27 , 2025 | 01:04 AM

నగరంలో రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారు. అరాచకం సృష్టిస్తూ, అదేమని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.

ఆటో డ్రైవర్‌ హత్య

మద్యం మత్తులో రౌడీషీటర్‌ ఘాతుకం

కంచరపాలెం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారు. అరాచకం సృష్టిస్తూ, అదేమని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత కంచరపాలెం ప్రాంతంలో ఓ రౌడీ షీటర్‌ మద్యం మత్తులో ఆటో డ్రైవర్‌పై దాడి చేసి హత మార్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం ప్రాంతంలోని తిక్కవానిపాలెంలో నివాసం ఉంటున్న నాగలి గణేష్‌కుమార్‌ (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు (6) ఉన్నారు. గొడవల కారణంగా ఐదు నెలల కిందట భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం గణేష్‌ ఆరేళ్ల కుమారుడితో ఉంటున్నాడు. ఇదిలావుండగా గురువారం అర్ధరాత్రి దాటాక స్థానిక శివాలయం ఎదురుగా గల రైల్వే స్థలంలో రౌడీషీటర్‌ తరుణ్‌, మరో ముగ్గురు కలిసి మద్యం సేవించసాగారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. పెద్దగా కేకలు వేసుకుంటూ గొడవ పడుతుండడంతో సమీపంలో ఉన్న గణేష్‌కుమార్‌ అక్కడకు వెళ్లి వారించాడు. వారిలో ఒకరితో గణేష్‌కు పాత గొడవలు ఉన్నాయి. ఆ విషయం తెలిసి రౌడీషీటర్‌ తరుణ్‌ కర్రతో గణేష్‌ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో గణేష్‌ తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయి మృతిచెందాడు. రాత్రి గస్తీ విధుల్లో ఉన్న పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Sep 27 , 2025 | 01:04 AM