జిల్లాలో ఆటిజం కేంద్రాలు
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:08 AM
ఆటిజం రుగ్మతతో బాధపడే నిరుపేద కుటుంబాల్లోని అభాగ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నర్సీపట్నం, ఎలమంచిలిలో ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు
ఒక్కో కేంద్రానికి రూ.27 లక్షల చొప్పున నిధులు
భవన నిర్మాణం, బోధకుల నియామకం, పరికరాలు సమకూర్చే పనిలో సమగ్ర శిక్ష అధికారులు
అనకాపల్లి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
ఆటిజం రుగ్మతతో బాధపడే నిరుపేద కుటుంబాల్లోని అభాగ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో రెండు ఆటిజం కేంద్రాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేంద్రాలను నర్సీపట్నం, ఎలమంచిలిల్లో ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.
ఆటిజం బారినపడిన చిన్నారుల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్య ఇదీ అని చెప్పలేని పరిస్థితి. ఒక్కో చిన్నారిలో ఒక్కోరకమైన ఇబ్బందులు కనిపిస్తాయి. ఇది ప్రవర్తనలో మార్పులతో కూడిన వ్యాధిగా చెప్పవచ్చు. శరీరంలోని కొన్ని భాగాల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. సాధారణ పిల్లలతో పోలిస్తే ఆటిజం బారినపడిన చిన్నారుల వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. ఆటిజం బారినపడిన చిన్నారుల్లో కొన్ని లక్షణాలను గుర్తించేందుకు అవకాశం ఉంది. ఎవరితోనూ కలవకపోవడం, నేరుగా కళ్లల్లోకి చూడలేకపోవడం, శబ్దాలను పట్టించుకోకపోవడం, పిలిచినా పలకకపోవడం, ఒంటరిగా ఆడుకోవడం, చేసిన పనులనే మళ్లీమళ్లీ చేస్తుండడం, హైపర్ యాక్టివ్‌గా ఉండడం, ఎక్కువ ఆందోళనకు గురవుతుండడం, వింత శబ్దాలు చేయడం, అకస్మాత్తుగా కోపం రావడం వంటి లక్షణాలుంటాయి. అయితే సమస్యపట్ల తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడంతో గుర్తించడం ఆలస్యమవుతున్నది. ఆటిజాన్ని స్ర్పెక్టమ్ డిజార్డర్ అని. న్యూరల్ బిహేవియర్ డిజార్డర్ అని చెబుతుంటారు. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో 20 శాతం ఆటిజం కేసులు నమోదవుతుండగా, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో ఐదు శాతానికిపైగానే నమోదవుతున్నట్టు చెబుతున్నారు. ఆటిజం సమస్య జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడినా, గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్రమైన ఉద్వేగాలకు లోనైనా పుట్టే పిల్లలకు ఆటిజం వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమైన్ వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోయినా, నెలలు నిండకుండా జన్మించినా, బాల్యంలో పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపకపోయినా, స్ర్కీన్ టైమ్, ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నా దీని బారినపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆటిజం బారినపడిన చిన్నారులకు లక్షణాలనుబట్టి మైల్డ్, మోడరేట్, సివియర్‌గా విభజించి వైద్య సేవలు అందిస్తారు. స్ర్కీనింగ్ చేసి విభజిస్తారు. సమస్య తీవ్రతను బట్టి స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, సెన్సార్ స్టిములేషన్ వంటి పద్ధతులను అనుసరించి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తారు.
ఆటీజం బాధిత చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పేందుకు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు పాఠశాలలు నడుపుతున్నారు. వీటిల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండడంతో ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్చించలేకపోతున్నారు. దీంతో ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున జిల్లాలో 24 భవిత కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిల్లో చదువుకుంటున్న వారిలో 105 మంది చిన్నారులు ఆటిజంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. అయితే వీరికి ఆటిజం విద్య పూర్తిస్థాయిలో అందడం లేదు. వీరి కోసం ఎలమంచిలి, నర్సీపట్నంలో ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో కేంద్రానికి రూ.27 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఆటిజం కేంద్రాలను ప్రారంభించడానికి సమగ్ర శిక్ష అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాలు నిర్మించి, బోధకులను నియమించి, అవసరమైన పరికరాలను సమకూరుస్తామని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జయప్రకాశ్ తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న భవిత కేంద్రాల్లో బోధకులకు ఆటిజం విద్యాబోధనపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి కోరామన్నారు.