బాల్య వివాహ ప్రయత్నాన్ని అడ్డుకున్న అధికారులు
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:21 PM
బాల్య వివాహం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన యువకుడికి, అగనంపూడి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికతో పెళ్లి నిశ్చయమైంది.
పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చిన ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ ప్రతినిధులు
రావికమతం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన యువకుడికి, అగనంపూడి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికతో పెళ్లి నిశ్చయమైంది. ఇటీవల ఇరు కుటుంబాల వారు నిశ్చితార్థం కూడా జరిపించారు. త్వరలో పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలికకు వివాహం చేస్తున్నారన్న సమాచారం చైల్డ్ వెల్ఫేర్ సిబ్బందికి అందింది. ఆ సంస్ధ ప్రతినిధి అంబేడ్కర్, సీడీపీవో మంగతాయారు, సూపర్‌వైజర్ ఉన్నిసా బేగం, మహిళా పోలీస్ నూకరత్నం, అంగన్‌వాడీ కార్యకర్త వెంకటలక్ష్మి కొత్తకోటలోని పెళ్లి కొడుకు ఇంటికి మంగళవారం వెళ్లారు. ఈ బాల్య వివాహ ప్రయత్నం విరమించుకోవాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో పాటు బాల్య వివాహం వలన జరిగే అనర్థాలను వారికి వివరించారు. బాలిక మేజరు అయ్యేంత వరకు పెళ్లి వాయిదా వేసుకోవాలని పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే బాల్య వివాహం చేయబోమని వారి నుంచి అంగీకార పత్రం తీసుకున్నారు.