ఆర్టీసీ కాంప్లెక్స్‌లో దుకాణాల వేలం వివాదాస్పదం
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:51 AM
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రెండు దుకాణాలు అద్దెకు ఇచ్చేందుకు నిర్వహించిన వేలం వివాదాస్పదంగా మారడంతో ఈ దుకాణాలకు నిర్వహించిన టెండర్‌ను రద్దు చేస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. దుకాణాల అద్దెకు నిర్వహించిన టెండర్‌లో కొందరు వ్యాపారులు రింగ్ అయు, గతంలో నెలకు రూ.2.70 లక్షలు ఉన్న అద్దె కంటే తక్కువగా నెలకు రూ.1.30 లక్షల అద్దెకు దుకాణాలు దక్కించుకోవడం, ఇది ఆరోపణలకు దారితీయడంతో ఈ టెండరు రద్దు చేసి మళ్లీ టెండరు పిలవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం.
- రెండు దుకాణాల అద్దె వేలం రద్దు?
- పాత అద్దె రూ.2.7 లక్షలు
- తాజాగా కేటాయించిన అద్దె నెలకు రూ.1.3 లక్షలు
- ఒకేసారి రూ.1.4 లక్షల అద్దె తగ్గిపోవడంపై స్థానికంగా విమర్శలు
- దుకాణాల కేటాయింపు నిర్ణయంపై వెనక్కి తగ్గిన ఆర్టీసీ అధికారులు
చోడవరం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రెండు దుకాణాలు అద్దెకు ఇచ్చేందుకు నిర్వహించిన వేలం వివాదాస్పదంగా మారడంతో ఈ దుకాణాలకు నిర్వహించిన టెండర్‌ను రద్దు చేస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. దుకాణాల అద్దెకు నిర్వహించిన టెండర్‌లో కొందరు వ్యాపారులు రింగ్ అయు, గతంలో నెలకు రూ.2.70 లక్షలు ఉన్న అద్దె కంటే తక్కువగా నెలకు రూ.1.30 లక్షల అద్దెకు దుకాణాలు దక్కించుకోవడం, ఇది ఆరోపణలకు దారితీయడంతో ఈ టెండరు రద్దు చేసి మళ్లీ టెండరు పిలవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు సమాచారం.
ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చెందిన స్థలంలో అనేక షాపులు ఉన్నాయి. ఈ దుకాణాలు అద్దెకు తీసుకునేందుకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో షాపు నంబరు 6, 7లకు కలిపి గతంలో రికార్డు స్థాయిలో అద్దె పలికింది. మూడేళ్ల క్రితం ఈ రెండు దుకాణాలకు ఏకంగా నెలకు రూ.3.10 లక్షలు అద్దెకు వెళ్లడంతో అప్పట్లో ఇది రికార్డుగా మారింది. ఆ తరువాత మూడు నెలలకే అంత మొత్తానికి వేలం పాడిన వ్యాపారి నెలకు రూ.3 లక్షలు పైబడి అద్దె కట్టలేకపోవడంతో మళ్లీ ఆర్టీసీ అధికారులు వేలం నిర్వహించారు. దీంతో ఈసారి నెల అద్దె రూ.2లక్షల 70వేలకు రెండు దుకాణాలు కేటాయించారు. అప్పటి నుంచీ ఇదే అద్దె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దుకాణాలకు ఈ నెల 21న ఆర్టీసీ అధికారులు టెండర్ నిర్వహించారు. అయితే అనూహ్యంగా రూ. 2లక్షల 70 వేలు అద్దె వచ్చే రెండు దుకాణాలను కేవలం రూ.లక్షా 30 వేలకే కేటాయించడంతో స్థానికంగా ఈ వ్యవహారం రచ్చగా మారింది. ఒకేసారి లక్షా 40వేల రూపాయలు అద్దె తగ్గిపోవడంపై విచారణ జరపాలని, ఆర్టీసీ అధికారుల టెండర్ నిర్వహణ సమీక్షంచాలని స్థానికంగా కొందరు వ్యాపారులు, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. టెండరుదారులు, ఆర్టీసీ సిబ్బంది కుమ్మక్కు కావడం వల్లే నెలకు ఏకంగా రూ.లక్షా 30 వేలు తక్కువ అద్దెకు దుకాణాలు కేటాయింపు జరిగిందని, దీని వలన సంస్థ ఆదాయానికి గండిపడిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఉన్న అద్దె కంటే ఎక్కువకు కోట్ చేసిన వారికే ఇవ్వాలని, లేదంటే టెండర్ రద్దు చే సి దుకాణాలు ఖాళీగా ఉంచాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. కాగా ఆర్టీసీ దుకాణాలకు నిర్వహించే టెండర్ల ప్రక్రియ సమాచారం వీలైనంత ఎక్కువమందికి తెలిసేలా చేయకపోవడం వలనే ఇటువంటివి జరుగుతున్నాయని పలువురు అంటున్నారు.