Share News

ఏయూకు జియో స్పేషియల్‌ అవార్డు

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:30 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకుంది.

ఏయూకు జియో స్పేషియల్‌ అవార్డు

  • దేశంలో ఈ అవార్డు దక్కించుకున్న నాలుగు వర్సిటీల్లో ఒకటి...

  • విభాగ అభివృద్ధికి చేసిన కృషిచేసిన ప్రొఫెసర్‌ వజీర్‌కు జ్యూరీ అవార్డు

విశాఖపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకుంది. జియో స్పేషియల్‌ రంగంలో నూతన ఆవిష్కరణలు, వినూత్నమైన పరిశోధనలు, పీహెచ్‌డీలు, వర్క్‌షాప్‌లు, డ్రోన్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్స్‌, సెమినార్స్‌ వంటివి నిర్వహిస్తున్నందుకుగాను వర్సిటీ ఈ అవార్డు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో ఈ కేటగిరీ అవార్డును నాలుగు వర్సిటీలు/విద్యా సంస్థలకు ఇవ్వగా, అందులో ఏయూ ఒకటి కావడం విశేషం. ఈ అవార్డును ఈ నెల 17న ఐఐటీ ముంబైలో ఓపెన్‌ స్పేస్‌ జీఐఎస్‌ సెలబ్రేషన్స్‌ పేరుతో నిర్వహించిన వేడుకల్లో ఇస్రో మాజీ చైర్మన్‌, స్పేస్‌ కమిషన్‌ మెంబర్‌ కిరణ్‌ కుమార్‌ చేతుల మీదుగా వర్సిటీ అధికారులు అందుకున్నారు. అలాగే, మరో కేటగిరీలో వర్సిటీకి చెందిన సీనియర్‌ ప్రొఫెసర్‌ అవార్డును అందుకున్నారు. జియో ఇంజనీరింగ్‌, రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌ కేంద్రం పూర్వ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వజీర్‌ మహ్మద్‌ జియో స్పేషియల్‌ ఫ్యాకల్టీ కేటగిరీలో జ్యూరీ అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డును దక్కించుకున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. ఈ విభాగానికి సంబంధించిన సాగిస్తున్న పరిశోధన, పీహెచ్‌డీలు ప్రదానం, పీహెచ్‌డీలో భాగంగా సంయుక్త పరిశోధన, కీలకమైన సమాచారాన్ని సేకరించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు అవార్డును ప్రదానం చేశారు. ఆయన 1991 నుంచి రిమోట్‌ సెన్సింగ్‌, జియో స్పేషియల్‌పై పరిశోధనలు సాగిస్తున్నారు. గడిచిన 35 ఏళ్లుగా జయో స్పేషియల్‌ రంగంలో ఆయన విశేషమైన సేవలను అందిస్తున్నారు. ఏయూకు జాతీయ జియో స్పేషియల్‌ అవార్డు లభించడం పట్ల వీసీ జీపీ రాజశేఖర్‌ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులను సాధించి వర్సిటీ ఖ్యాతి పెంచాలని సూచించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటున్న తరుణంలో ఈ అవార్డు రావడం, విద్య, నాయకత్వం, ఆవిష్కరణలలో వర్సిటీ ఘనమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అవార్డు దక్కించుకున్న వజీర్‌ మహ్మద్‌ను వీసీ జీపీ రాజశేఖర్‌ తన కార్యాలయంలో అభినందించారు.


6న జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక

విశాఖపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ నూతన స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక వచ్చే నెల ఆరో తేదీన నిర్వహించాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుత స్టాండింగ్‌ కమిటీ కాలపరిమితి అదే రోజుతో ముగుస్తుంది. ఏడో తేదీనాటికి కొత్త కమిటీ ఎన్నిక పూర్తికావాల్సి ఉంటుంది. దీంతో వచ్చే నెల ఆరున కొత్త కమిటీకి ఎన్నిక పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై జీవీఎంసీ మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కమిషనర్‌ కేతన్‌గార్గ్‌తో ఇప్పటికే అధికారులు చర్చించగా, వారంతా సమ్మతించినట్టు తెలిసింది. జీవీఎంసీ పాలకవర్గం వచ్చే ఏడాది మార్చి పదితో ముగియనుండడంతో కొత్తగా ఎన్నికయ్యే స్టాండింగ్‌ కమిటీ కాలపరిమితి కూడా ఏడునెలలు మాత్రమే ఉంటుంది.


96.36 శాతం కార్డుదారులకు రేషన్‌ సరకులు పంపిణీ

జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కర్‌

విశాఖపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 641 రేషన్‌ డిపోల ద్వారా 5,05,886 మంది కార్డుదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేశామని పౌర సరఫరాల అధికారి వి.భాస్కర్‌ తెలిపారు. ఆయన శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ నాలుగు గ్రామీణ మండలాలు, నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో 5,24,986 మంది కార్డుదారులు ఉండగా, జూలై నెలకుగాను 5,05,887 మంది కార్డుదారులకు (96.36 శాతం) సరకులు అందించామన్నారు. అత్యధికంగా పెందుర్తి మండలంలో 97.84 శాతం, ఆనందపురంలో 97.42 శాతం కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేశామన్నారు. ఎండీయూ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ ఏడాది మే నెలలో 96.67 శాతం సరుకులు పంపిణీ జరిగిందన్నారు. ఆ వ్యవస్థ రద్దు అయిన తరువాత జూన్‌లో 93.83 శాతం పంపిణీ చేయగా, జూలై వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు పరిష్కరించడంతో సరకులు పంపిణీ 96.36 శాతానికి పెరిగిందన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 01:30 AM