పడకేసిన ఏయూ ఆరోగ్య కేంద్రం
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:23 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రంలో ఆశించిన స్థాయిలో సదుపాయాలు లేవని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ మేరకు కలెక్టర్‌కు కొద్దిరోజుల కిందట నివేదిక సమర్పించింది.
ఏళ్ల తరబడి అధికారుల నిర్లక్ష్యం
ఆశించిన స్థాయిలో సదుపాయాలు లేవు
అత్యవసర వైద్యం అందించే పరిస్థితులూ లేవు
అధ్వానంగా అంబులెన్స్
హాస్టల్ విద్యార్థి మృతిపై నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక?
ఖాళీలను భర్తీ చేయడంతో పాటు విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని సూచన
విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య కేంద్రంలో ఆశించిన స్థాయిలో సదుపాయాలు లేవని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఈ మేరకు కలెక్టర్‌కు కొద్దిరోజుల కిందట నివేదిక సమర్పించింది. ఇటీవల హాస్టల్ విద్యార్థి ఒకరు మృతిచెందడంతో వర్సిటీ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సంధ్యాదేవి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణితో కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ వారంపాటు విచారణ జరిపి నివేదికను సమర్పించింది. అందులో ఏముందన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. త్రిసభ్య కమిటీ కీలక అంశాలను నివేదికలో ప్రస్తావించినట్టు తెలిసింది. విద్యార్థి మణికంఠ మాసివ్ హార్ట్ అటాక్ కారణంగా మృతిచెందినట్టు కమిటీ నిర్ధారించింది. విద్యార్థిని క్యాంపస్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పుడు తగిన వసతులు, అత్యవసర వైద్యం అందించేందుకు అనుగుణమైన పరిస్థితులు లేవని, అంబులెన్స్ అధ్వానంగా ఉందని పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే, విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా డిస్పెన్సరీ ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురికావడం వల్లే ఈ పరిస్థితి దాపురించినట్టు తెలిపింది. వేలాది మంది విద్యార్థులు, సిబ్బందికి వైద్య సేవలు అందించే ఆస్పత్రిలో తగినంతమంది వైద్యులు, సిబ్బంది లేరని, అయినా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో పేర్కొంది. ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పనతోపాటు సిబ్బంది నియామకం చేపట్టాలని, మందులు అందుబాటులో ఉంచడంతోపాటు విద్యార్థులకు సీపీఆర్‌తోపాటు ప్రాథమిక వైద్య సేవలు (ఫస్ట్ ఎయిడ్) అందించడంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కమిటీ సూచించింది. అయితే, ఈ నివేదికను ఆధారంగా చేసుకుని ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.