గిరి బాలల చదువుపై శ్రద్ధ
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:16 AM
జిల్లాలో విద్యాభివృద్ధికి అధికారులు చేపడుతున్న ప్రత్యేక చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు 90 వేల మంది గిరిజన విద్యార్థులకు, 6 వేల మంది టీచర్లకు ప్రయోజనం చేకూరుతున్నది.
విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
టీచర్లకు శిక్షణ, విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు
90 వేల మంది విద్యార్థులు, 6 వేల మంది టీచర్లకు ప్రయోజనం
ఇటీవల కలెక్టర్‌ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో విద్యాభివృద్ధికి అధికారులు చేపడుతున్న ప్రత్యేక చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు 90 వేల మంది గిరిజన విద్యార్థులకు, 6 వేల మంది టీచర్లకు ప్రయోజనం చేకూరుతున్నది. ఈ ప్రత్యేక చర్యలపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్‌ను అభినందించిన సంగతి తెలిసిందే. శత శాతం ఫలితాల సాధనకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.
జిల్లా శత శాతం గిరిజన ప్రాంతం కావడంతో పాటు పలు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో విద్యా రంగంలో ఆశించిన ఫలితాలు లభించడం లేదు. ప్రధానంగా విద్యకు పునాదిగా భావించే ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో గిరిజన విద్యార్థులకు ఆశించిన విద్యాబోధన అందకపోవడమే కారణమని గుర్తించారు. అందువల్లే గిరిజన విద్యార్థులు ఉన్నత తరగతుల్లో ఇబ్బందులు పడుతున్నారని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో ప్రాథఽమిక, ప్రాథమికోన్నత స్థాయిల్లో విద్యార్థులకు ముఖ్యమైన తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు సబ్జెక్టుల్లో ప్రత్యేక బోధనా తరగతులు అవసరమని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో 3 నుంచి 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు, సమగ్ర శిక్ష రూపొందించిన 21 రకాల మాడ్యుల్‌ను వినియోగించి బోధన సాగించేలా గత నవంబరు 20 నుంచి వంద రోజుల ప్రణాళికను పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.
టీఆర్‌ఎల్ శిక్షణతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు
జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధిని మరింత పటిష్ఠం చేసేందుకు టీచింగ్ ఎట్ రైట్ లెవల్(టీఆర్‌ఎల్)ను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది అక్టోబరు నెలలో 3 నుంచి 9 తరగతులు బోధిస్తున్న టీచర్లకు తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు సబ్జెక్టులపై 21 మాడ్యుల్‌తో 6 వేల 216 మంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఇందుకు గాను 40 మంది రాష్ట్ర స్థాయి రీసోర్సు పర్సన్లు, 88 మంది జిల్లా స్థాయి రీసోర్సు పర్సన్లు పని చేశారు. శిక్షణ పొందిన టీచర్ల ద్వారా ప్రత్యక్షంగా 90 వేల మంది గిరిజన విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. కాగా అన్ని తరగతుల్లోనూ చక్కని ఫలితాలను రాబెట్టేందుకు ఈ ఏడాది నవంబరు 20 నుంచి వంద రోజుల ప్రణాళిక పేరిట ప్రత్యేక బోధన సాఽగిస్తున్నారు. ఇందులో భాగంగా టీచర్లతో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్లను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు ప్రత్యేక చొరవతో టీచింగ్ ఎట్ రైట్ లెవల్(టీఆర్‌ఎల్)ను, వంద రోజుల విద్యా ప్రణాళికను అమలు చేస్తుండడంపై సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.