Share News

మారుమూల గ్రామాలపై శ్రద్ధ

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:43 PM

మారుమూల కొండలపై గల గ్రామాల్లో ప్రజోపయోగ అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజావసరాలకు వీలుగా బహుళ ప్రయోజక భవన నిర్మాణానికి చర్యలు చేపట్టింది.

మారుమూల గ్రామాలపై శ్రద్ధ
జెర్రిగొందిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న బహుళ ప్రయోజక భవనం

గిరిజనుల అవసరాలు తీర్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం

కొండలపై గల గ్రామాల్లో బహుళ ప్రయోజక భవన నిర్మాణానికి శ్రీకారం

అంగన్‌వాడీ కేంద్రం, ఉప ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాలు ఒకే భవనంలో ఉండేలా చర్యలు

ప్రయోగాత్మకంగా జెర్రిగొంది గ్రామంలో నిర్మాణం

ఈ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు

కొయ్యూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మారుమూల కొండలపై గల గ్రామాల్లో ప్రజోపయోగ అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రజావసరాలకు వీలుగా బహుళ ప్రయోజక భవన నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు ప్రయోగాత్మకంగా యు.చీడిపాలెం పంచాయతీ అత్యంత మారుమూల కొండలపై గల జెర్రిగొంది గ్రామంలో పీఎం జన్‌మన్‌ పథకం కింద రూ.50 లక్షల వ్యయంతో బహుళ ప్రయోజక భవనాన్ని నిర్మించి ప్రారంభానికి సిద్ధం చేశారు.

మన్యంలో అంగన్‌వాడీ కేంద్రం, ఉప ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాలు వంటి సదుపాయాలు లేని గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ, వాటికి ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం నిల్వ చేయడానికి కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సబ్‌సెంటర్‌ నిర్వహణకు భవన సదుపాయం లేకపోవడంతో కొండలపై జీవిస్తున్న గిరిజనులకు సకాలంలో వైద్యం అందడం లేదు. కొండలపై గల గ్రామాల ప్రజలు పండుగలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అవసరమైన భవన సదుపాయం లేక అవస్థలు పడు తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రజావసరాలన్నీ తీర్చే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం, కమ్యూనిటీ హాలు ఒకే భవనంలో ఉండేలా నాలుగు గదులతో కూడిన భవనాన్ని అన్ని సదుపాయాలతో నిర్మించేందుకు యు.చీడిపాలెం పంచాయతీ జెర్రిగొంది గ్రామంలో ఆరు నెలల క్రితం శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నో ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు ఈ గ్రామంలో కనీసం ప్రభుత్వ పరంగా చిన్నపాటి రేకుల షెడ్డు కూడా నిర్మించిన దాఖలాలు లేవు. అటువంటి ఈ గ్రామంలో గిరిజన సంక్షేమశాఖ పర్యవేక్షణలో రూ.50 లక్షల వ్యయంతో అన్ని వసతులతో బహుళ ప్రయోజక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని ఈ నెలలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Dec 22 , 2025 | 11:43 PM