పెందుర్తి వీఆర్వోపై దాడి
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:15 AM
ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన వీఆర్వోపై అక్రమార్కులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన పెందుర్తిలో ఆదివారం రాత్రి జరిగింది. బాధిత వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పెందుర్తి సీఐ కేవీ సతీశ్‌కుమార్, వీఆర్వో తెలిపిన వివరాల మేరకు...
ఆక్రమణలు తొలగించే క్రమంలో ఘటన
ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
పెందుర్తి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన వీఆర్వోపై అక్రమార్కులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన పెందుర్తిలో ఆదివారం రాత్రి జరిగింది. బాధిత వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పెందుర్తి సీఐ కేవీ సతీశ్‌కుమార్, వీఆర్వో తెలిపిన వివరాల మేరకు...
పెందుర్తి సమీపంలోని గోకాడ సర్వే నంబరు 231/1లో గల ప్రభుత్వ చెరువు స్థలంలో కొంతమంది ఆక్రమణలకు పాల్పడ్డారు. నిర్మాణానికి బేస్‌మెంట్ తీశారు. దీనిపై అందిన ఫిర్యాదుమేరకు ఆక్రమణలు తొలిగించాలని తహసీల్దార్ ఇంటి వెంకట అప్పారావు ఆదేశించారు. ఈ మేరకు పెందుర్తి వీఆర్వో ఆనంద్‌కుమార్. అతనికి సహాయంగా మరో వీఆర్వో పృధ్వీ ఆక్రమిత చెరువు స్థలం వద్దకు ఆదివారం రాత్రి చేరుకున్నారు. బేస్‌మెంట్‌పై గల ఇటుకలు తొలగిస్తుండగా, ఆరుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆక్రమణలు తొలగిస్తున్నామని సమాధానం ఇవ్వడంతో వారంతా తీవ్ర ఆగ్రహంతో వీఆర్వో ఆనంద్‌కుమార్‌పై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులతో గాయపరిచారు. పక్కనే ఉన్న మరో వీఆర్వో పృధ్వీ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీఆర్వోపై దాడి జరుగుతోందనే సమాచారంతో అప్రమత్తమైన రెవెన్యూ సిబ్బంది పోలీసులకు కాల్ చేయడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విధుల్లో ఉన్నత తనపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారని బాధిత వీఆర్వో ఆనంద్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ సతీశ్‌కుమార్ విచారణ చేపట్టారు. వీఆర్వోపై దాడి జరిగిందని తేలడంతో పెతకంశెట్టి నాగరాజు, పెతకంశెట్టి సూరిబాబు, పెతకంశెట్టి సురేశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, ఆక్రమణల తొలగింపును అడ్డుకుని అతనిపై దాడికి పాల్పడడంతో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.