Share News

చికెన్‌ షాపుల్లో దారుణం

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:09 AM

నగరంలోని కొందరు చికెన్‌ దుకాణాల నిర్వాహకులు దారుణానికి ఒడిగడుతున్నారు.

చికెన్‌ షాపుల్లో దారుణం

  • చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్న నిర్వాహకులు

  • వ్యాన్‌లలో దర్జాగా దుకాణాలకు తరలింపు

  • సాధారణ చికెన్‌తో కలిపి విక్రయాలు

  • ఇటీవల పెదగదిలి చికెన్‌ దుకాణంలో వెలుగులోకి

  • వీడియోతీసి జీవీఎంసీ అధికారులకు పంపిన స్థానికుడు

  • రూ.5 వేల జరిమానాతో సరిపెట్టేసిన అధికారులు

  • నగరంలోని అనేక చికెన్‌ దుకాణాల్లో ఇదే తీరు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలోని కొందరు చికెన్‌ దుకాణాల నిర్వాహకులు దారుణానికి ఒడిగడుతున్నారు. తమ జేబులు నింపుకునేందుకు ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. కోళ్లఫారాల్లో వివిధ కారణాలతో చనిపోయిన కోళ్లను వ్యాన్లలో నగరానికి తీసుకువచ్చి దుకాణాల్లో దింపేస్తున్నారు. చనిపోయిన కోళ్లను సాధారణ చికెన్‌తో కలిపి విక్రయిస్తున్నారు. ఈ దారుణాలపై అధికారుల వద్ద సమాచారం ఉన్నప్పటికీ చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పెదగదిలి జంక్షన్‌లోని ఒక చికెన్‌ దుకాణంలో చనిపోయిన కోళ్లను వ్యాన్‌ నుంచి దింపుతున్న వీడియో బయటపడడంతో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

జీవీఎంసీ పరిధిలో సుమారు ఐదు వేల చికెన్‌ దుకాణాలున్నాయి. నగర శివారుతోపాటు పొరుగు జిల్లాల్లోని కోళ్లఫారాల నుంచి కోళ్లను ట్రేడర్లు వ్యాన్ల ద్వారా చికెన్‌దుకాణాలకు చేరవేస్తుంటారు. కొందరు కోళ్లఫారాల యజమానులు తమ ఫారాల్లో పెంచిన కోళ్లను నేరుగా చికెన్‌ దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. ఫారాల్లో పెరిగే కోళ్లకు వివిధ రకాల వైరస్‌ల బెడద వుంటుంది. దీనివల్ల తరచూ కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. కొన్నిసార్లు కోళ్లను ఫారంలో ఎక్కువ కాలం ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఎక్కువ కోళ్లు చనిపోతాయి. ఇలాంటివి జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి లోతుగా గోతిలో పూడ్చిపెట్టాలి. అయితే కొందరు ట్రేడర్లు, కోళ్లఫారాల యజమానులు వాటిని వ్యాన్లలో చికెన్‌ దుకాణాలకు తరలించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్‌ ధర కంటే 20శాతం తక్కువకు విక్రయించేస్తారు. దీనివల్ల ట్రేడర్లకు ఎంతోకొంత ఖర్చులు రాగా, చికెన్‌ వ్యాపారులు చనిపోయిన కోళ్లను ఆరోగ్యంగా ఉండే కోళ్లతో కలిపి ప్రజలకు విక్రయించేస్తున్నారు. అయితే అలాంటి చికెన్‌ తినడం వల్ల ప్రజారోగ్యానికి ప్రమాదం.

పెదగదిలిలో వెలుగులోకి

ఇటీవల ఆరిలోవ సమీపంలోని పెదగదిలి జంక్షన్‌లో ఒక చికెన్‌ దుకాణం వద్ద రెండు కోళ్లవ్యాన్‌లు లోడుతో వచ్చి ఆగాయి. వాటిలో చనిపోయిన కోళ్లను ఇద్దరు వ్యక్తులు పదేసి చొప్పున ఒక దుకాణం వద్ద దింపి వెళ్లిపోయారు. అక్కడ మరో దుకాణం ముందు ఆపి అక్కడ కూడా పదేసి చనిపోయిన కోళ్లను దింపారు. ఈ దృశ్యాన్ని కొందరు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి జీవీఎంసీ ప్రజారోగ్యవిభాగం అధికారులకు పంపించారు. జోన్‌-2 ప్రజారోగ్యవిభాగం అధికారులు వీడియోలో కనిపించిన దుకాణం వద్దకు వెళ్లి రూ. 5వేలు జరిమానా విధించి చేతులు దులిపేసుకున్నారు. ఆ వ్యాన్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? నగరంలో ఏయే దుకాణాలకు చనిపోయిన కోళ్లను సరఫరా చేశాయి. చికెన్‌షాప్‌ నిర్వాహకులు గతంలో ఎన్నిసార్లు అలా చేశారు వంటి వివరాలు ఆరా తీయలేదు.

అధికారులకు తెలిసినా...

నగరంలో చాలా చికెన్‌ దుకాణాల్లో ఈతరహా దారుణాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయని, ఆదాయమే పరమావధిగా కొందరు వ్యాపారులు ప్రజారోగ్యానికి చిల్లులు పెడుతున్నారని సమాచారం. ఇప్పటికైనా జవీఎంసీ అధికారులు ఈ దందాపై దృష్టిపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Oct 20 , 2025 | 12:09 AM