ఆటోడ్రైవర్లకు భరోసా
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:43 AM
‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకానికి జిల్లాలో 25,193 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు.
‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకానికి జిల్లాలో 25,193 మంది అర్హులు
4న రూ.15,000 చొప్పున జమ
విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకానికి జిల్లాలో 25,193 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. 784 దరఖాస్తులను తిరస్కరించగా, మరో 329 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ‘వాహనమిత్ర’ పథకం కింద ఏడాదికి రూ.పది వేలు చొప్పున అందజేసేది. అయితే దానికి రెండు రెట్లు అధికంగా ఆటోడ్రైవర్ల నుంచి జరిమానాల రూపంలో తిరిగి వసూలుచేసేది. దీంతో ప్రభుత్వం తమ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేసేవారు.
ప్రస్తుతానికి వస్తే...ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ‘స్త్రీశక్తి పథకం’ కింద ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. దాంతో ఆటోలకు డిమాండ్ కాస్త తగ్గడంతో వారంతా తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ‘ఆటోడ్రైవర్ సేవలో’ పేరుతో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందజేస్తానని ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన వారంతా సెప్టెంబరు 17లోగా దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా 26,314 మంది ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆనందపురం మండలం నుంచి 1,472 మంది, భీమిలి నుంచి 1,206, పద్మనాభం నుంచి 693, పెందుర్తి నుంచి 992, జీవీఎంసీ జోన్-1 నుంచి 656, జీవీఎంసీ జోన్-2 నుంచి 4,254, జోన్-3 నుంచి 2,679, జోన్-4 నుంచి 2,011, జోన్-5 నుంచి 4,640, జోన్-6 నుంచి 4,543, జోన్-7 నుంచి 3,168 దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు 25,193 మందిని అర్హులుగా గుర్తించారు. 784 మంది దరఖాస్తుదారులు అనర్హులుగా పేర్కొంటూ తిరస్కరించారు. 63 దరఖాస్తులను హోల్డ్‌లో ఉంచగా, ఎనిమిది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవికాకుండా వార్డు సచివాలయాల్లో 237 దరఖాస్తులు, ఎంపీడీవో కార్యాలయాల్లో 29 పెండింగ్‌లో ఉన్నాయి. దసరా రోజునే ‘ఆటోడ్రైవర్ సేవలో’ నిధులు జమ కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో రెండు రోజులు ఆలస్యంగా అక్టోబరు నాలుగున పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాలుగో తేదీ ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో కార్యక్రమం ఏర్పాటుచేసి లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నట్టు రవాణా శాఖ జిల్లా ఉపకమిషనర్ వాసుదేవ్ తెలిపారు.