Share News

ఆటో డ్రైవర్లకు భరోసా!

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:59 AM

ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ముందుకు వచ్చింది. అర్హులైన ఆటో కార్మికులకు రూ.15 వేల చొప్పున దసరా పండుగ రోజున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకోసం నేటి (బుధవారం) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటనపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆటో డ్రైవర్లకు భరోసా!
లబ్ధి పొందనున్న ఆటో డ్రైవర్లు

ప్రతి ఒక్కరికీ రూ.15 వేల ఆర్థిక సాయం

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

19వ తేదీ వరకే గడువు

22వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలన

24న అర్హుల జాబితా విడుదల

దసరా పండుగనాడు డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ

వాహన మిత్రతో పోలిస్తే 50 శాతం అధిక సాయం

ప్రభుత్వ ప్రకటనపై ఆటో కార్మికుల హర్షం

(అనకాపల్లి-ఆంఽధ్రజ్యోతి)

ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ముందుకు వచ్చింది. అర్హులైన ఆటో కార్మికులకు రూ.15 వేల చొప్పున దసరా పండుగ రోజున బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకోసం నేటి (బుధవారం) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటనపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్ర్తీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆటోలను ఆశ్రయించే ప్రయాణికులు తగ్గిపోయి, ఆదాయాన్ని కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించనున్నట్టు సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్‌ సిక్స్‌ - సూపర్‌ హిట్‌’ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రవాణా శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 13,450 ఆటోలు వున్నాయి. వీటిపై సుమారు 13 వేల డ్రైవర్లు (కార్మికులు) ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పేరుతో ఏటా రూ.10 వేలు మాత్రమే అందించింది. కూటమి ప్రభుత్వం మరో 50 శాతం అధికంగా.. అంటే రూ.15 వేల చొప్పున చెల్లించనున్నట్టు ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికపై రవాణా శాఖ అధికారులకు విధివిధానాలను జారీ చేసింది.

ఎవరు అర్హులు?

ఆటోరిక్షా, మోటారు క్యాబ్‌, మ్యాక్సీక్యాబ్‌ను సొంతంగా నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారికే ఈ పథకం వర్తిస్తుంది. ఆధార్‌కార్డు, బియ్యం రేషన్‌ కార్డు ఉండాలి. ఏపీ రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వాహనం రిజిసే్ట్రషన్‌ సర్టిఫికెట్‌, ఫిట్‌నెస్‌, ట్యాక్స్‌ వంటివి చెల్లుబాటు అయ్యే రికార్డులు ఉండాలి. ఆటోలకు ఒక నెలలోపు తీసుకున్న ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ప్రయాణికులను చేరవేసే వాహనాలు నడిపేవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. సరకు రవాణా వాహనాలు నడిపేవారు ఈ పథకానికి అర్హులు కారు. ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే పథకం వర్తిస్తుంది. ఇతర వృత్తి సంబంధిత ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులు అయితే.. ఈ పథకకానికి అనర్హులుగా పరిగణిస్తారు. దరఖాస్తుదారుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఉద్యోగ విరమణ పెన్షన్‌దారులై ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు వెసులుబాటు కల్పించారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, నెలకు 300 యూనిట్లకన్నా ఎక్కువ (12 నెలల సగటు) విద్యుత్‌ వినియోగించే వారు, పల్లం భూమి మూడు ఎకరాలు, మెట్ట భూమి పది ఎకరాలకు మించి వున్న వారు ఈ పథకానికి అనర్హులవుతారు. పట్టణ ప్రాంతంలో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నివాస భవనం వున్నవారు, లీజు/ అద్దెకు తీసుకుని వాహనాలు, ఆర్టీఓ చలానాలు బాకీ ఉన్న వాహనాలు ఈ పథకం కిందకు రావు.

దరఖాస్తుకు మూడు రోజులే గడువు

మనోహర్‌, జిల్లా రవాణా శాఖ అధికారి

అర్హులైన ఆటో రిక్షా, మోటారు క్యాబ్‌, మ్యాక్సీక్యాబ్‌ల డ్రైవర్లు బుధవారం నుంచి జీఎస్‌డబ్ల్యూఎస్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 19వ తేదీ వరకే గడువు వుంది. అందిన దరఖాస్తులపై గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది 22వ తేదీన క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఎంపీడీఓలు/ మునిసిపల్‌ కమిషనర్లు/ జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ తుది జాబితాలను కలెక్టర్‌కు పంపారు. అర్హుల జాబితాను ఈ నెల 24వ తేదీన ప్రకటిస్తారు. ఈ పథకానికి అర్హులుగా ఎంపికైన వారికి దసరా పండుగ రోజున బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది.

Updated Date - Sep 17 , 2025 | 12:59 AM