ఏసీబీ వలలో ఏఎస్‌వో
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:29 AM
రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు లంచం తీసుకుంటూ పౌర సరఫరాల శాఖ గాజువాక సర్కిల్-3 ఏఎస్‌వో బి.కృష్ణ బుధవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గాజువాకకు చెందిన ఎ.నారాయణ వాహనాలు రెండు ఐదు నెలల కిందట అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా ఏఎస్‌వో కృష్ట పట్టుకుని న్యూపోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వాహనాలను విడుదల చేయాలని పలుమార్లు ఏఎస్‌వోను కోరినప్పటికీ పట్టించుకోలేదు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన
సహాయ పౌర సరఫరాల శాఖ అధికారి
వాహనాల విడుదలకు రూ.10 వేలు డిమాండ్
అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన బాధితుడు
కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
గాజువాక, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు లంచం తీసుకుంటూ పౌర సరఫరాల శాఖ గాజువాక సర్కిల్-3 ఏఎస్‌వో బి.కృష్ణ బుధవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గాజువాకకు చెందిన ఎ.నారాయణ వాహనాలు రెండు ఐదు నెలల కిందట అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా ఏఎస్‌వో కృష్ట పట్టుకుని న్యూపోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వాహనాలను విడుదల చేయాలని పలుమార్లు ఏఎస్‌వోను కోరినప్పటికీ పట్టించుకోలేదు. డబ్బు ఇస్తేనే విడుదల చేస్తానని పట్టుబట్టాడు. దీంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. వాహనాలను తక్షణమే విడుదల చేయాలని జాయింట్ కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీజ్ చేసిన రెండు వాహనాలను నారాయణకు అప్పగించాలని జాయింట్ కలెక్టర్ గత అక్టోబరులో గాజువాక ఏఎస్‌వోను ఆదేశించారు. అయినప్పటికీ వాహనాలను అప్పగించేందుకు ఏఎస్వో లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు మంగళవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఏఎస్‌వోపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం బుధవారం సాయంత్రం గాజువాక ఏఎస్‌వో కార్యాలయంలో నారాయణ వద్ద నుంచి ఏఎస్‌వో కృష్ణ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు ఫైళ్లను పరిశీలించి, సిబ్బందిని విచారించారు. ఏఎస్‌వో కృష్ణపై కేసు నమోదు చేశారు. గురువారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
అవినీతిలో ఘనుడు
సర్కిల్-3 సహాయ పౌర సరఫరాల అధికారి టి.కృష్ణపై చాలాకాలంగా ఆరోపణలు
ఒక్కో డిపో నుంచి నెలకు రూ.2 వేలు చొప్పున వసూలు
రేషన్ డీలర్ల సంఘ నేతతో కలిసి కొన్ని డిపోల నిర్వహణ
రైస్ మాఫియాతో చెట్టపట్టాల్
విశాఖపట్నం/గాజువాక, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
గాజువాక కేంద్రంగా గల సర్కిల్-3 సహాయ పౌర సరఫరాల అధికారి టి.కృష్ణ అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతుంటారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే మాఫియాతో చెట్టపట్టాలేసుకుని తిరిగే కృష్ణ బుధవారం రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గత ప్రభుత్వ హయాంలో గాజువాక ఏఎస్‌వోగా వచ్చిన కృష్ణ మూడేళ్లుగా అక్కడే తిష్ఠ వేశారు. కూటమి నేత దన్ను ఉందని చెప్పుకునే ఆయన...పౌర సరఫరాల శాఖలో సీనియర్ అధికారులను కూడా ఖాతరు చేయరు. ఉమ్మడి ఏపీలో పౌర సరఫరాల శాఖ అధికారుల సంఘం కోశాధికారిగా పనిచేయడంతో ఉన్నతాధికారులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన పరిధిలో రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడుతుంటారనే ఫిర్యాదులు ఉన్నాయి.
సర్కిల్-3 పరిధిలో 130 రేషన్ డిపోలు ఉన్నాయి. ప్రతి డిపో నుంచి నెలకు రెండు వేల వంతున మామూళ్లు వసూలు చేస్తున్నట్టు డీలర్లే చెబుతున్నారు. ప్రధానంగా బినామీ డిపోలకు సంబంధించి అక్రమాలకు ప్రోత్సహించారనే వాదన ఉంది. దీనికి అదనంగా నెలకు ఐదు వేల రూపాయల వరకూ తీసుకుంటున్నారు. అదేవిధంగా సర్కిల్-3లో కొన్ని షాపులను రేషన్ డీలర్ల సంఘం నేత ఒకరితో కలిసి ఏఎస్‌వోనే నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు, ముగ్గురు చెకింగ్ ఇన్‌స్పెక్టర్లతో కలిసి ఈ వ్యవహారం నడుపుతున్నారంటున్నారు. ఇంకా డిపోల ద్వారా పంపిణీ చేసే బియ్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించే మాఫియాతో ఏఎస్‌వోకు సన్నిహిత సంబంధాలున్నాయి. రైస్ మిల్లర్ల నుంచి భారీగా మామూళ్లు తీసుకుంటున్నారని, అందుకే వారి అక్రమాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నారని గాజువాక ప్రాంతానికి చెందిన డీలర్లు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందితే గత్యంతరం లేక డిపో లేదా అక్రమ బియ్యం తరలిస్తున్న వాహనాలపై కేసులు పెడుతుంటారు తప్ప అధికారిగా తన విధులు నిర్వహించడంలో విఫలమయ్యారని డీలర్లు వ్యాఖ్యానిస్తున్నారు.