అనారోగ్యంతో ఆశ్రమ విద్యార్థిని మృతి
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:17 PM
జీకేవీధి మండలంలోని సీలేరు ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది.
జ్వరమొచ్చిందని పీహెచ్‌సీకి తీసుకు వెళ్లిన పాఠశాల సిబ్బంది
హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చింతపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్య సిబ్బంది సూచన
పాఠశాలకు తీసుకువెళ్లిపోగా మర్నాడు మృతి
సీలేరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి) : జీకేవీధి మండలంలోని సీలేరు ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం జ్వరంతో బాధపడుతున్న ఆ విద్యార్థిని ఆదివారం ఉదయం కళ్లు తిరిగి పడిపోగా, పీహెచ్‌సీకి తరలిస్తుండగా మృతి చెందింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి.
నిమ్మగొంది గ్రామానికి చెందిన పాంగి నిర్మల(11) జీకేవీధి మండలంలోని సీలేరు ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. శనివారం ఆ బాలికకు జ్వరం రావడంతో సిబ్బంది సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు చేసి జ్వరం లేదని, హిమోగ్లోబిన్ 4.5 శాతం మాత్రమే ఉందని, రక్తం ఎక్కించాలని సూచించారు. రక్తం ఎక్కించడానికి చింతపల్లి ఆస్పత్రికి రిఫర్ చేస్తామన్నారు. అయితే అక్కడ నుంచే ఆ బాలిక తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది ఫోన్ చేసి నిర్మలను చింతపల్లి ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని, మీరు పాఠశాలకు రావాలని సమాచారం ఇచ్చారు. అనంతరం ఆ బాలికను పాఠశాలకు తీసుకు వెళ్లిపోయారు. కాగా ఆదివారం ఉదయం నిర్మల కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించగా వైద్యాధికారి నారాయణరావు పరిశీలించి అప్పటికే ఆ బాలిక మృతి చెందిందని చెప్పారని వార్డెన్ పి.నాగశకుంతల తెలిపారు. పాఠశాలకు చేరుకున్న బాలిక తండ్రి మృతి చెందిన కుమార్తెను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం అంబులెన్స్‌లో బాలిక మృతదేహాన్ని తీసుకువెళ్లిపోయారు.