అనారోగ్యంతో ఆశ్రమ విద్యార్థిని మృతి
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:51 PM
అనారోగ్యంతో బాధపడుతున్న రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. దీనికి సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
కొయ్యూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడుతున్న రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. దీనికి సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో కినపర్తి గ్రామానికి చెందిన పొట్టిక నీలవేణి(11) ఆరవ తరగతి చదువుతోంది. గత నెల 26వ తేదీన ఆ బాలికకు జ్వరం వచ్చింది. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు తెలియజేశారు. గత నెల 28న పాఠశాలకు వచ్చిన బాలిక తల్లి సత్యవతి తనతో పాటు కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లిపోయింది. కృష్ణాదేవిపేటలో ఓ ప్రైవేటు వైద్యుని వద్ద చికిత్స చేయించారు. అయినా జర్వం తగ్గకపోవడంతో నర్సీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్ వెంటనే పాఠశాల హెచ్‌ఎం మృదుభాషిణితో పాటు సిబ్బందికి సమాచారం ఇచ్చి కినపర్తి గ్రామానికి పంపించారు. బాలిక అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించి తల్లితండ్రులను వారు ఓదార్చారు. నీలవేణి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.